
మెట్రోలో లివర్ రవాణా
బనశంకరి: మానవ అవయవాలను శనివారం మెట్రో రైలులో వైట్‌ఫీల్డ్‌లోని వైదేహి ఆసుపత్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని ఆర్‌ఆర్.నగర స్పర్శ్ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ సమస్యలు వస్తాయని రైలులో తరలించారు. బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవదానం చేయగా, కాలేయాన్ని స్పర్శ్ ఆస్పత్రికి పంపించారు. మెట్రో అధికారులు, పోలీసులు ఇందులో పాల్గొన్నారు. సకాలంలో చేరుకున్నట్లు తెలిపారు.
ఏపీ నుంచి గంజాయి రవాణా
యశవంతపుర: మంగళూరు నగర సీసీబీ పోలీసులు గాలింపు జరిపి 123 కేజీల గంజాయిని, రవాణా చేస్తున్న రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కేరళ కాసరగోడు తాలూకావాసులు మసూద్ ఎంకె (45), మొహమ్మద్ అషిక్ (24), సుబేర్ (30)లను అరెస్ట్ చేశారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని అక్రమంగా తరలించి అధిక ధరలకు అమ్మేవారు. రెండు కార్లలో 123 కేజీల గంజాయిని తీసుకెళ్తున్నట్లు తెలిసి దాడులు జరిపారు.
మంగళూరులో
ఎన్‌ఐఏ సోదాలు
యశవంతపుర: మంగళూరులోని బజ్పెలో హిందూ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య కేసులో దక్షిణ కన్నడ జిల్లావ్యాప్తంగా ఎన్‌ఐఎ అధికారులు దాడులు చేశారు. బజ్పెలో 10 చోట్ల, సూరత్కల్‌లో 4 చోట్ల ఇళ్లు, ఆఫీసులలో పత్రాలను పరిశీలించి కొందరిని విచారించారు. మే 1న సుహాస్‌శెట్టిని కొందరు దుండగులు కత్తులతో నరికిచంపారు. ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు.
మోసకారి ఇన్‌స్టా లవర్
● యువతికి మాయమాటలు చెప్పి
బంగారు నగలు కాజేత
● తమిళనాడులో అరెస్టు
అన్నానగర్: సోషల్ మీడియా ప్రేమలు చివరకు మోసాలుగా మిగిలిపోతున్నాయి. ఆకర్షణ మోజులో ముక్కుమొహం తెలియనివారిని నమ్మి డబ్బు, నగలు అర్పించుకుని లబోదిబోమనడం మామూలైంది. అలాంటిదే ఈ వ్యవహారం కూడా. తమిళనాడులో బెంగళూరు ఇన్‌స్టా లవర్ యువతిని మోసపుచ్చి కటకటాల పాలయ్యాడు. వివరాలు.. విరుదునగర్ జిల్లా రాజపాళ్యం ఆవరంపట్టి ప్రాంతానికి చెందిన నాగసెంథిల్ పవర్ లూమ్ యజమాని. ఇతని కూతురు నాగ అక్షయ (19). ఆమె డిగ్రీ చదువుతోంది. ఆరు నెలల క్రితం ఆమెకు ఇన్‌స్టా ద్వారా బెంగళూరుకు చెందిన లివిన్ (22) అనే యువకునితో పరిచయం ఏర్పడింది. నాగ అక్షయను గాఢంగా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పగా ఆమె సరేనంది. నేను మీ ఊరికి వచ్చి వెంటనే మూడుముళ్లు కట్టేస్తానని, మనం ఉండటానికి ఇల్లు కొనడానికి డబ్బు ఇవ్వమని అడిగాడు. ఆమె ఒప్పుకోగా లివిన్ రాజపాళయం వచ్చాడు. అతనిని ఆమె తన ఇంటికి ఆహ్వానించి, 25 తులాల బంగారు నగలను ఇచ్చింది. దానిని అందుకున్న తర్వాత, లివిన్ కర్ణాటకకు తిరిగివెళ్లిపోయాడు.
మళ్లీ రూ. 50 వేలు కావాలని
అర్జంటుగా రూ. 50 వేల డబ్బు పంపాలని ఆమెను అడిగాడు. ప్రేమికుని మాటలపై అనుమానం వచ్చిన నాగ అక్షయ, డబ్బు ఇస్తా, రాజపాళయం రమ్మని కోరింది. మరోవైపు పోలీసులకు సమాచారం ఇచ్చింది. లివిన్ రాగానే పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.