
అవినీతి అధికారి కుర్చీకి సత్కారం
గౌరిబిదనూరు: ఇటీవల లోకాయుక్త అధికారులు పట్టణంలో నీటిపారుదల, పారిశుధ్య ఇంజినీరుగా పనిచేస్తున్న ఆంజినేయమూర్తి ఆఫీసు, ఇళ్లల్లో సోదాలు చేసి సుమారు రూ.5 కోట్ల అక్రమ ఆస్తులను కనిపెట్టారు. ఈ నేపథ్యంలో ఆంజినేయమూర్తి అవినీతికి విరుద్దంగా కర్ణాటక రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నీటి పారుదల ఆఫీసు ముందు ధర్నా చేశారు. ఆయన ఫ్లెక్సీని తీసుకుని వచ్చి, కుర్చీలో ఉంచి, పూలదండలు వేసి వ్యంగ్య సత్కారం చేశారు. పార్టీ నేత జాణగెరె రవి ప్రసంగిస్తూ సిగ్గు, లజ్జా లేని అధికారులకు ఇటుంటి సన్మానాలు చేస్తే ఇతరులకు బుద్ధి వస్తుందని ఈ సన్మానోత్సవం చేశామన్నారు.
కట్నపిశాచులకు జైలుశిక్ష
మైసూరు: భర్త కుటుంబం వేధింపులతో విసిగిపోయిన ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న కేసులో దోషులకు జైలుశిక్ష పడింది. వివరాలు.. మైసూరులోని శారదాదేవి నగరలో నివాసముంటున్న గౌతమ్ అతని తల్లి కుశలకుమారి, సోదరి స్వప్న దోషులు. నగరంలోనే నివసించే విశ్వేశరరావు కుమార్తె మహాలక్ష్మితో గౌతమ్‌కు 2011లో పెళ్లయింది. రూ. 10 వేలు, 12 గ్రాముల బంగారు గొలుసు, అర కిలో వెండి దీపాలు, కొన్ని వెండి వస్తువులును కట్నంగా తీసుకొన్నారు. మెట్టినింట్లో ఆమెను నిత్యం సతాయించేవారు, మరింత కట్నం తీసుకురావాలని కోరేవారు. మహాలక్ష్మికి తాత రాసిచ్చిన ఆస్తిని తీసుకువాలని ఒత్తిడి చేశారు. ఇది తట్టుకోలేక ఆమె 2013 ఆగస్టులో మెట్టినింట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. గౌతమ్, కుశలకుమారి, స్వప్నలపై సరస్వతిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. అప్పటి నుంచి కోర్టులో కేసు సాగుతూ వచ్చింది. 5వ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కే.ఎన్.రూప నేరం రుజువు కావడంతో ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు.
రమ్య పోస్టుల కేసులో ముగ్గురు అరెస్టు
యశవంతపుర: శాండల్‌వుడ్ నటి, మాజీ ఎంపీ రమ్యపై అశ్లీల సందేశాలు పోస్టు చేసిన కేసుల్లో 13 మందిని గుర్తించారు. వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ తెలిపారు. సోషల్ మీడియాలో కించపరిచే పోస్టులపై నగర సైబర్ క్రైం స్టేషన్ సిబ్బంది సీరియస్‌గా పని చేస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. అసభ్య వ్యాఖ్యలు చేస్తూ సందేశాలు పంపే వ్యక్తులపై చట్టం ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. బళ్లారి, చిత్రదుర్గ, బెంగళూరు, కోలారు జిల్లాల పరిధిలో 50 అకౌంట్లపై నిఘా ఉంచిన్నట్లు తెలిపారు. బెంగళూరు చుట్టుపక్కల నుంచి అనేక మంది కామెంట్లు చేసినట్లు గుర్తించారు. బళ్లారికి చెందిన ఒకరు, చిత్రదుర్గకు చెందిన మరొకరితో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తునట్లు చెప్పారు. కాగా, తన ఫిర్యాదుపై స్పందించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులకు నటి రమ్య ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ నటుడు దర్శన్‌కు వ్యతిరేకంగా ఆమె ప్రకటనలు చేయడంతో అశ్లీల సందేశాల గొడవ మొదలైంది. మా హీరోనే విమర్శిస్తావా అని ఆమైపె కొందరు అసభ్య పోస్టులు పెట్టారు.

అవినీతి అధికారి కుర్చీకి సత్కారం