
భారీ వర్షాలతో రోడ్లకు కోతలు
రాయచూరు రూరల్: రహదారులు నాగరికతకు ఆనవాళ్లు. అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు రహదారుల సొగసు చూడతరము కాదు. నాణ్యత లేని నిర్మాణాల కారణంగా ప్రధాన రహదారులు ధ్వంసం అయ్యాయి. ఇటీవల జిల్లాలో భారీ వర్షాలు కురువడంతో రాయచూరు–మటమారి, లింగసూగూరు, మాన్వి, మంత్రాలయం రోడ్ల పరిస్థితి ఘోరంగా మారింది. గ్రామీణ రహదారులు మరింత జటిలంగా మారాయి. రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత గురించి అధికారులు పట్టించుకోక పోవడంతో వాటి జీవిత కాలం తగ్గిపోతోంది. రోడ్లు భవనాల శాఖ, ప్రజా పనుల శాఖ, జిల్లా పంచాయతీ అధికారులు తమకొచ్చే లంచాల వాటాలతో సంతృప్తి చెందుతుండగా కాంట్రాక్టర్లు వివిధ మార్గాల్లో లాభాలు పొందుతున్నారు. మెయింటెనన్స్ పేరుతో పలు శాఖల అధికారులు రూ.వేలాదిగా వ్యయం చేసి చేపడుతున్న పనులు మూన్నాళ్లకే మట్టి కొట్టుకొని పోతున్నాయిు. సాధారణంగా కొత్త రోడ్లు వేసు ముందు మట్టి రోడ్లు వేస్తారు. మట్టి అణగడానికి కొంత కాలం పడుతుంది.
నాసిరకం పనులతో నాణ్యత లేమి
రోడ్డు కుంగిపోతే, ఆ ప్రాంతంలో రాతిగుండ్లు వేిసి కుంగకుండా చేస్తారు. దీనిని సోలింగ్ అరెంజ్‌మెంట్ అని పిలుస్తారు. రోడుపై వాటర్ బెండ్, మొరంతో రోడ్డు వేస్తారు. 60 ఎంఎం పొర గల క్రషింగ్ కంకర వాడాలి. కాంట్రాక్టర్లే 100 ఎంఎం రాళ్లు, ఎర్ర మట్టితో కప్పి చేతులు దులుపుకుంటున్నారు. రోడ్లు అధిక కాలం మన్నాలంటే రోలర్ తిప్పాలి. కాంట్రాక్టర్ తాత్కాలికంగా రోలర్ తిప్పడంతో కంకర త్వరగా లేచి పోతోంది. తారు రోడ్లు వేయడంలో కాంట్రాక్టర్లు అనేక అవకతకవలకు పాల్పడుతున్నారు. నేడు తారు రోడ్డు వేయడానికి హాట్ మిక్స్ విధానం అవలంభిస్తున్నారు. ఆశాపూర్ రహదారిని ఏడాది క్రితం వేశారు. ఇడపనూరు, పుచ్చలదిన్ని, మిడగలదిన్ని, గదార, యరగేర, మాన్వి, దేవదుర్గ గామీణ ప్రాంతాల్లోని వల్కందిన్ని, ముస్టూరు, ఉప్పరాళ, సంకనూరు, బిచ్చాలి, యద్లాపూర్ మధ్య రహదారులు కోతకు గురయ్యాయి.

భారీ వర్షాలతో రోడ్లకు కోతలు