
రిక్షాపై విరిగిపడిన చెట్టు కొమ్మ
హుబ్లీ: నడుస్తున్న ఆటో రిక్షాపై భారీ వృక్షం కొమ్మ విరిగిపడిన ఘటన సుభాష్ రోడ్డులో గురువారం చోటు చేసుకుంది. గాంధీ చౌక్ మార్గం నుంచి సుభాష్ రోడ్డు మీదుగా బస్టాండ్ వైపునకు ఆటో వెళుతుండగా సదరు కొమ్మ ఉన్నఫళంగా విరిగి పడింది. ఆ సమయంలో రిక్షాలో ఉన్న డ్రైవర్, వృద్ధురాలు అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విషయం తెలిసిన తక్షణమే ఘటన స్థలానికి ధార్వాడ ట్రాఫిక్ పోలీసులు వచ్చి సదరు కొమ్మును తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు.
తాగునీటి పథకాలకు పెద్దపీట
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో తాగునీటి రంగం అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. రాయచూరు తాలూకా యరగేర పంచాయతీ జలజీవన్ మిషన్ పథఽకం పనులను ఆయన తనిఖీ చేశారు. వారం రోజుల్లో 200 ఇళ్లకు నీటి పైప్‌లైన్ కనెక్షన్లను జోడించాలన్నారు. నీటి పథకాలను పూర్తి చేయడానికి ఏడాది కాలం పట్టిందా? అంటూ అధికారులపై మండిపడ్డారు. సిరవార తాలూకా కల్లూరులో జలధార, జీవన్ పథకాలను చూసి ఆగస్ట్ 15లోగా పూర్తి చేయాలన్నారు. తాలూకాలో 14 పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న ఇంటి, ఆస్తి, నీటి పన్నులను వసూలు చేయాలని ఉద్యోగులను ఆదేశించారు. తాలూకాలో వివిధ తాగునీటి పథకాలను పరిశీలించారు.
బకాయి వేతనాలు చెల్లించండి
రాయచూరు రూరల్: పరీక్షల ప్రశ్న పత్రాల మౌల్య మాపనం చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు బకాయి వేతనాలు చెల్లించాలని జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు నరసప్ప భండారి తెలిపారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025లో జరిగిన పరీక్షలు రాిసిన విద్యార్థుల జవాబు పత్రాలకు సంబంధించి మార్చి, ఏప్రిల్, జూన్ నెలల్లో చేసిన మౌల్యమాపనం పనులకు ఇంతవరకు వేతనాలు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో 65 వేల మంది అధ్యాపకులకు రూ.75 కోట్ల వేతనాలు అందజేయాల్సి ఉందన్నారు.
యరగేర తాలూకా
ప్రకటనకు సమ్మతి
రాయచూరు రూరల్: యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించిందని యరగేర తాలూకా పోరాట సమితి అధ్యక్షుడు నిజాముద్దీన్ వెల్లడించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అనుకూలమయ్యే విధంగా తాలూకాను ఏర్పాటు చేయడానికి సౌకర్యాలు ఉన్నాయన్నారు. యరగేర వద్ద 256 ఎకరాల్లో ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం, జాతీయ రహదారి–167 ఉందన్నారు. యరగేర పరిధిలో 19 గ్రామ పంచాయతీలు, 78 గ్రామాలు ఉన్నాయన్నారు. 2020 నుంచి యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించామన్నారు. బెంగళూరు ఫ్రీడం పార్క్‌లో ఆందోళనకు మద్దతు ఇచ్చిన నేతలు తాలూకా కేంద్రంగా ప్రకటించడానికి సీఎం సమ్మతించారన్నారు. బసవరాజ్, మెహబూబ్ పటేల్, మహ్మద్ రఫీ తదితరులున్నారు.
నలుగురికి జీవిత ఖైదు
కోలారు : హత్య కేసుకు సంబంధించి నలుగురు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఇంటి స్థలం వివాదం నేపథ్యంలో ఏపీలోని పుంగనూరుకు చెందిన ఆగస్థ్య రెడ్డి (84)అనే వ్యక్తి 2017లో శ్రీనివాసపురం తాలూకా పుంగనూరు క్రాస్ వద్ద హత్యకు గురయ్యాడు. అగస్థ్య రెడ్డి భార్య లక్ష్మమ్మ, కుమారుడు మాధవ రెడ్డి ఫిర్యాదు మేరకు రజనికుమార్, కృష్ణారెడ్డి, సుబ్రమణ్యం, జ్యోతిషవర్ అనే నిందితులను శ్రీనివాసపురం పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జ్‌షీట్ సమర్పించారు. ఈకేసులో 38 మంది సాక్షులను విచారణ చేశారు. ఈకేసు గురువారం విచారణకు వచ్చింది. నిందితుల నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

రిక్షాపై విరిగిపడిన చెట్టు కొమ్మ