
కాంగ్రెస్ సర్కారుపై రైతన్న కదం
సాక్షిబళ్లారి: కేంద్ర ప్రభుత్వం రైతులకు కావాల్సినంత రసాయనిక ఎరువులు, యూరియాను రాష్ట్రాలకు సరఫరా చేస్తుందని అయితే కేంద్రం ఇచ్చిన యూరియాను రైతులకు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ రైతు మోర్ఛా నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం కదం తొక్కారు. నగరంలో ర్యాలీ నిర్వహించి రాయల్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి బైఠాయించారు. రాష్ట్రంలో రైతులకు కావాల్సినంత యూరియా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. తుంగభద్ర ఆయకట్టు కింద విస్తారంగా వరినాట్లు వేస్తున్న సమయంలో యూరియా లేకపోతే రైతులు పంటలు సాగు చేయడానికి కష్టంగా ఉంటుందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడే దిశలో పని చేయడం లేదన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు.
బీజేపీ హయాం సంక్షేమ పరం
బీజేపీ హయాంలో రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. అయితే వాటిని నిలుపుదల చేశారన్నారు. పంటలు వేయడానికి ఎరువులు కూడా సరఫరా చేయడం లేదన్నారు. పంట పండించిన తర్వాత కూడా గిట్టుబాటు ధర కూడా కల్పించడం లేదన్నారు. యూరియా కోసం రైతులు రోడ్లపైకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతు మోర్ఛా నాయకులు గురులింగనగౌడ, ఐనాథ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. విత్తనాలు, ఎరువుల కొరతతో సతమతం అవుతున్నారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కొన్ని జిల్లాలకే పరిమితం అయ్యారని వాపోయారు. మండ్య జిల్లా, బెంగళూరులను మాత్రమే ఆయన పట్టించుకుంటున్నారని, ఈ ప్రాంత రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అవినీతి కాంగ్రెస్ సర్కార్ అంటూ నినదించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌నాయుడు, నాయకులు కేఎస్ దివాకర్, హనుమంతప్ప, రైతు మోర్ఛా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల సరఫరాలో వైఫల్యంపై గరం
నగరంలో పార్టీ కార్యకర్తల భారీ ర్యాలీ