మహిళపై దుండగుల దాడి | - | Sakshi
Sakshi News home page

మహిళపై దుండగుల దాడి

Jul 18 2025 1:19 PM | Updated on Jul 18 2025 1:19 PM

మహిళపై దుండగుల దాడి

మహిళపై దుండగుల దాడి

హుబ్లీ: మంటూరు రోడ్డు అరళికట్టె వీధిలో ఇటీవల జరిగిన గుంపు ఘర్షణ కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన మహిళపై దాడి చేసిన ఘటన గురువారం వెలుగు చూసింది. ఆ రోడ్డులోని మౌలాలి దర్గా వద్ద వెళుతుండగా బైక్‌ మీద మాస్క్‌ వేసుకొని వచ్చిన ఇద్దరు వ్యక్తులు మావుబీ బీజాపుర అనే మహిళ కంట్లో కారం చల్లి దాడి చేశారు. ప్రస్తుతం కేఎంసీ ఆస్పత్రిలో మహిళ చికిత్స పొందుతోంది. సదరు గుంపు ఘర్షణలో గాయపడిన ఈ మహిళ కూడా చికిత్స పొందుతోంది. అంతేగాక ఆమె కాలికి గాయమైంది. ఆమె పోలీస్‌ స్టేషన్‌కు వెళుతుండగా సాక్ష్యం చెప్పాలని పోలీసులు సూచించారు. దీంతో ఆమైపె దాడి జరిగినట్లు బాధితురాలు అనుమానం వ్యక్తం చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సర్కారు బడిలో పేలిన సిలిండర్‌

తృటిలో తప్పిన పెను ప్రమాదం

సాక్షి,బళ్లారి: ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేసే వంటగదిలో సిలిండర్‌ పేలడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం చిత్రదుర్గ జిల్లా మల్లాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో సిలిండర్‌ ఉన్నఫళంగా పేలడంతో వంట సామగ్రి, ఇతర వస్తువులు మాత్రమే కాలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై చిత్రదుర్గ రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఒపెక్‌ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ

రాయచూరు రూరల్‌ : రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ(ఒపెక్‌) ఆస్పత్రిలో ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించినట్లు జిల్లాధికారి నితీష్‌ పేర్కొన్నారు. బుధవారం ఒపెక్‌ ఆస్పత్రిని సందర్శించి వైద్యాధికారులతో మాట్లాడారు. క్యాన్సర్‌కు చికిత్సతో పాటు రోగులందరికీ సమానంగా వైద్యం చేస్తారన్నారు. కార్డియాలజీ, యూరాలజీ, అనస్థిషియా, పీడియాట్రిక్‌, ప్లాస్టిక్‌ సర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్టో సర్జికల్‌, మెడికల్‌ గ్యాస్ట్రో, పైకో మ్యాక్సిలరీ సర్జరీ సౌకర్యాలు కల్పించారన్నారు. ఆస్పత్రి ప్రత్యేక అధికారి డాక్టర్‌ రమేష్‌ సాగర్‌, నీలప్రభ, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు, విజయ్‌ శంకర్‌లున్నారు.

దేశ సేవకు సిద్ధంగా ఉండాలి

బళ్లారిఅర్బన్‌: దేశ సేవకు, సమాజ సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కళ్యాణ కర్ణాటక మాజీ పారా మిలిటరీ సంఘం ప్రధాన కార్యదర్శి బీఎన్‌.ప్రహ్లాద్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. బళ్లారి జిల్లా ఇన్నర్‌ వీల్‌ సంస్థ సహకారంతో ఎంజీఎం పాఠశాల, కళాశాల విద్యార్థులకు సదరు సంఘం ఆధ్వర్యంలో దేశ రక్షణలో పారా మిలిటరీ దళాల పాత్ర అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేటి పిల్లలే రేపటి పౌరులని అన్నారు. కన్న తల్లిదండ్రులకు ఉత్తమ కుమారుడిగా, గురువులకు మంచి శిష్యుడిగా, మంచి విద్యార్థిగా మెలగాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సిబ్బంది, విద్యార్థులు, ఇన్నర్‌వీల్‌ అధ్యక్షులు, కార్యదర్శి, సభ్యులు, మాజీ సైనికులు జిల్లా హోంగార్డ్స్‌ కమాండెంట్‌ షేక్‌సాబ్‌, కళ్యాణ కర్ణాటక మాజీ పారా మిలిటరీ సంఘం ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి, డైరెక్టర్లు లక్ష్మణ్‌, ఎంఆర్‌ రెడ్డి పాల్గొన్నారు.

శ్రీచైతన్య కళాశాల డైరెక్టర్‌ రాధాకృష్ణ కన్నుమూత

సాక్షి,బళ్లారి: నగరంలో పేరుగాంచిన శ్రీచైతన్య కళాశాల డైరెక్టర్‌ పయ్యావుల రాధాకృష్ణ(65) కన్నుమూశారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నెల రోజులుగా ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతూ బళ్లారిలో చికిత్స తీసుకున్న అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న తరుణంలో చికిత్స ఫలించిక మరణించారు. నెల రోజులుగా ఆయనకు వైద్యులు వివిధ రకాలుగా వైద్యం అందించినా చికిత్స ఫలించలేదు. ఆయన సొంత ఊరు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్‌ కాగా బళ్లారిలో ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తూ, శ్రీచైతన్య విద్యా సంస్థలను స్థాపించి అంచెలంచెలుగా కళాశాలలను ముందుకు తీసుకెళ్లారు. గత 20 సంవత్సరాలకు పైగా శ్రీచైతన్య కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నారు. బళ్లారితో పాటు చిత్రదుర్గ జిల్లాలో కూడా ఆయన విద్యా సంస్థలను స్థాపించారు. ఉన్నఫళంగా ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకొని ఆయన మృతి చెందడంపై కుటుంబ సభ్యులతో పాటు శ్రీచైతన్య కళాశాల సిబ్బంది, నగర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు భార్య పయ్యావుల రాధిక, పయ్యావుల విష్ణు, పయ్యావుల సంజయ్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement