నేడు బెంగళూరులో వైఎస్సార్‌ జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

నేడు బెంగళూరులో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

Jul 8 2025 6:55 AM | Updated on Jul 8 2025 6:55 AM

నేడు

నేడు బెంగళూరులో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

బనశంకరి: పేదల పెన్నిధి, అపరభగీరథుడు, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని ఈనెల 8న బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ సమర్థనం ట్రస్టు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం బెంగళూరు టీమ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సమర్థనం ట్రస్టు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి పేదలు, వృద్ధులు, పిల్లలకు అన్నదానం నిర్వహిస్తారు. వైఎస్సార్‌ అభిమానులు, వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటీ వింగ్‌టీమ్‌ విజ్ఞప్తి చేసింది. హాజరయ్యేవారు పండ్లు, బిస్కెట్లు తీసుకువచ్చి వృద్ధులకు, పిల్లలకు అందజేయవచ్చని పేర్కొంది. వివరాలకు 9035193106, 9945207998, 9703518965 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

భార్యకు డీఎస్పీ వేధింపులు

బనశంకరి: ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి ఇంట్లో భార్యను వేధింపులకు గురిచేశాడో డీఎస్పీ. బెంగళూరులో డీఎస్పీ శంకరప్ప పై కేసు నమోదైంది. కాలేజీకి వెళ్లే కుమారుడు ఉన్నప్పటికీ మరో మహిళతో శంకరప్ప అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను నిర్లక్ష్యం చేయసాగాడు. భార్య ప్రశ్నించడంతో ఆమెను కొట్టి వేధించేవాడు. మరింత కట్నం తేవాలని బెదిరించడంతో పాటు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని భార్య డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈశాన్య విభాగం మహిళా పోలీస్టేషన్‌లో శంకరప్ప పై కేసు నమోదైంది.

టూరిస్టు బస్సు బోల్తా

13 మందికి గాయాలు

మైసూరు: చామరాజనగర జిల్లాలోని యళందూరు తాలూకాలోని బిళిగిరి రంగనబెట్టలో ఆలయ దర్శనం చేసుకొని టూరిస్టులు తిరిగి వస్తుండగా వారి మినీ బస్సు పల్టీ కొట్టింది. 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దర్శనాల తరువాత అడ్డదారిలో వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. వారిని యళందూరు తాలూకా ఆస్పత్రికి తరలించారు. బాధితులు తుమకూరు నుంచి టూర్‌కి వచ్చారని తెలిసింది.

రెండు బైక్‌లు ఢీకొని దగ్ధం

ఇద్దరు మృతి

మైసూరు: డెలివరీ బాయ్‌ అతివేగంగా మరో బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మైసూరులోని బన్ని మండపంలోని ఎన్‌.ఆర్‌. మొహల్లా నెల్సన్‌ మండేలా రోడ్డులో జరిగింది. బైక్‌లు మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి. చామరాజనగర నివాసి, వ్యాపారి సయ్యద్‌ షెరాన్‌ (30), ఎంఎస్‌ కార్తీక్‌ (42) డెలివరీ బాయ్‌ మృతులు. సోమవారం తెల్లవారుజామున కస్టమర్లకు ఆహారం తీసుకెళ్తూ వేగంగా బైక్‌ నడుపుతున్నాడు. ఘటనాస్థలిలో సయ్యద్‌ బైక్‌ని ఢీకొన్నాడు. ఇద్దరూ గాయాలతో అక్కడే చనిపోగా మంటలు చెలరేగి వాహనాలు దగ్ధమయ్యాయి. ట్రాఫిక్‌ పోలీసులు చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

అనైతిక దందా గుట్టురట్టు

మైసూరు: మైసూరులో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. ఇద్దరు యువతులను కాపాడి, నలుగురు పురుషులను అరెస్టు చేశారు. ఈ దందా నడుపుతున్న ప్రధాన నిందితుడు మంజు, మరొకరిని పట్టుకున్నారు. జయపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దాసనకొప్పలులోని ఒక ఇంట్లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అమాయక యువతులను డబ్బుతో ప్రలోభపెట్టి వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే ఒడనాడి సేవా సంస్థ సిబ్బంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తరువాత పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి యువతులను కాపాడి, నిందితులకు బేడీలు వేశారు. వారి నుంచి కొంత డబ్బు, మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేశారు.

నేడు బెంగళూరులో   వైఎస్సార్‌ జయంతి వేడుకలు
1
1/1

నేడు బెంగళూరులో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement