
అలరించిన నాటకం
గౌరిబిదనూరు: సందేశాత్మక నాటకాలు సమాజ పరివర్తనకు దోహద పడతాయని మాజీ మంత్రి, డా హెచ్‌ఎన్ ప్రాధికారం అధ్యక్షుడు శివశంకరరెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి హెచ్ ఎన్ కళా భవనంలో ఐశ్వర్య కళానికేతన్ కళాకారులచే నాటకోత్సవాల ముగింపు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మంగమాణిక్య ప్రహసన నాటక ప్రదర్శన ఆహూతులను అలరించింది. శివశంకరరెడ్డి మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో టీవీలు, మొబైల్‌ఫోన్లు వచ్చి నాటకకళ సమాజానికి దూరమవుతూ ఉంది, ఆ కళను రక్షించడానికి కళాకారులు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు.
ఆరోగ్యంతోనే బలమైన భారత్: గవర్నర్
దొడ్డబళ్లాపురం: ఆరోగ్య భారతం– బలమైన భారతం అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరూ అలవరవచుకోవాలని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. బెంగళూరులో సోమవారంనాడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్యుల సమ్మేళనం గవర్నర్ పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో వైద్యం వేల సంవత్సరాల పురాతనమైనది, ఇది మన సంస్కృతీ సంప్రదాయాల్లో మమేకమై ఉందన్నారు. చరక, సుశ్రుత, ధన్వంతరి లాంటి మహా ఋషులు వైద్యాన్ని ఆధ్యాత్మిక, విజ్ఞాన దృష్టికోణంతో చూశారన్నారు. ఆరోగ్యం కోసం ఆయుర్వేదం, యోగ, సిద్ధ, యునాని, హోమియోపతి , అలోపతి లాంటి వివిధ రకాల వైద్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్యులు వైజ్ఞానిక దృష్టికోణంతో ఆలోచిస్తే నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్,హృద్రోగం,షుగర్ తదితర రోగాలను తరిమికొట్టవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంకల్పం చేయాలని, జీవన శైలిలో, ఆహారంలో మార్పులు చేసుకోవాలని సూచించారు.
నవమాసాలు మోసి.. ప్రాణాలు తీసింది
దొడ్డబళ్లాపురం: చంటి బిడ్డను చూసుకోవడం కష్టంగా ఉందని ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. నవమాసాలు మోసి కన్న శిశువును నీళ్లు కాచే అండాలో ముంచి హత్య చేసిన దారుణ సంఘటన నెలమంగల తాలూకా విశ్వేశ్వరపురలో చోటుచేసుకుంది. స్థానికంగా పవన్, రాధ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒకటిన్నర నెల మగబిడ్డ ఉన్నాడు. పేదరికం వల్లనో, మరో కారణం చేతో తల్లి రాధ.. శిశువును నీళ్లు కాచే అండాలో ముంచి ప్రాణాలు తీసింది. స్థానికులు చూసి నెలమంగల పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పరిశీలించి రాధను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
చిక్కిన చిరుత
తుమకూరు: సుమారు నెలరోజుల నుంచి 7 గ్రామాల ప్రజలకు కంటికి నిద్ర లేకుండా చేస్తున్న మూడు నాలుగు చిరుతలలో ఒకటి ఎట్టకేలకు బోనులో పడింది. జిల్లాలో అంచె కొప్పలు గ్రామంలో ఉన్న తోటలో అటవీ సిబ్బంది పెట్టిన బోనులో చిక్కింది. రెండురోజుల కిందట కొన్నిచోట్ల బోనులు ఏర్పాటుచేశారు. ఆదివారం రాత్రి ఆహారంకోసంవచ్చిన చిరుత ఓ బోనులోకి చిక్కింది. సోమవారం ఉదయం దానిని చూసి అటవీ సిబ్బందికి అప్పగించారు. గ్రామాల పరిసరాల్లో చిరుతల సంచారం పెరగడంతో మహిళలు, పిల్లలు భయపడుతున్నారు. గ్రామస్తులు గుంపులుగా రాత్రివేళ గస్తీ తిరుగుతున్నారు. మరో మూడు చిరుతలు ఉన్నాయని, వాటిని కూడా బంధించాలని ప్రజలు కోరారు.
ప్రకాశ్‌రాజ్‌పై మంత్రి ధ్వజం
యశవంతపుర: దేవనహళ్లిలో భూస్వాధీనం వద్దని నటుడు ప్రకాశ్‌రాజ్ రైతులకు మద్దతు పోరాటం చేస్తున్నారు. అలాగే ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌కు వెళ్లి అక్కడి రైతుల తరఫున కూడా పోరాడాలని పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ అన్నారు. దీనికి స్పందించిన ప్రకాశ్‌రాజ్ తాను తమిళనాడు రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తుంటే పాల్గొన్నట్లు తెలిపారు. పంజాబ్, హరియానా రైతుల ఆందోళనలకు మద్దతు ఇచ్చానన్నారు. దేవనహళ్లి రైతుల ఆందోళనలో ప్రకాశ్ రాజ్ పాల్గొనడంపై మంత్రి మండిపడ్డారు. అభివృద్ధిని ఎందుకు అడ్డుకొంటారని ధ్వజమెత్తారు.

అలరించిన నాటకం

అలరించిన నాటకం