
మోదీ గద్దె దిగితే ఖర్గేనే ప్రధాని
హుబ్లీ: మోదీ గద్దె దిగితే జేడీయూ, టీడీపీ వంటి పార్టీల మద్దతుతో యూపలే సారథిగా మల్లికార్జున ఖర్గే ప్రధాని అవుతారని సీఎం ఆర్థిక సలహాదారుడు, మాజీ మంత్రి బసవరాజ రాయరెడ్డి జోస్యం చెప్పారు. సోమవారం స్థానిక మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో కొన్ని రాజకీయ పరిణామాలను గమనిస్తే ప్రధాని మోదీ గద్దె దిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం మారి కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పడితే మల్లికార్జున ఖర్గే ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ 75 ఏళ్ల తర్వాత రాజకీయ విరమణ అవసరం అన్నారు. సెప్టెంబర్‌కు మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. ఆయన ప్రధాని పదవి నుంచి కిందకు దిగాలి లేదంటే ఈ విషయంలో ద్వంద్వ వైఖరి తేటతెల్లం అవుతుందన్నారు.
విపక్షాలు యూపీఏకు మద్దతివ్వవచ్చు
మోదీ గద్దె దిగితే జేడీయూ, టీడీపీ వంటి పార్టీలు తాము ఇచ్చిన మద్దతు వాపస్ తీసుకొని యూపీఏకు మద్దతు ఇవ్వవచ్చు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని పదవికి తొలి ఎంపిక అయితే ఖర్గే రెండవ ఎంపిక అన్నారు. గాంధీ కుటుంబం అధికార త్యాగానికి తనదైన శైలిలో సేవలు అందించిందని, దీనికి సోనియాగాంధీ ప్రధాన నిదర్శనం అన్నారు. ఈ సారి కూడా ఆ కుటుంబ త్యాగం చేయడానికి ముందుకు వస్తే ఖర్గే ప్రధాని అవుతారన్నది తన ఆశయం అన్నారు. రాష్ట్రంలో విపక్షాలు ఖర్గేను పీఎం అంటూ ప్రకటిస్తున్నారు కదా అని అన్నారు. అయితే వారి ఆ వ్యంగ్యమే నిజమయ్యే కాలం వచ్చిందన్నారు. రాష్ట్రంలో సీఎం మార్పు లేనే లేదు. ముందున్న మూడేళ్లు సిద్దునే సీఎంగా ఉంటారు. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే మాత్రమే ఏమైనా మార్పులు జరగవచ్చన్నారు.
విపక్షాల ఆరోపణలు అవాస్తవం
ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల నిధుల విడుదలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రమే రూ.50 కోట్లు అన్నది సరికాదు. కళ్యాణ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లు కేటాయించారు. గత బీజేపీ సర్కారులో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఇచ్చి విపక్ష ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక కొరత లేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.11 వేల కోట్ల నిధులు రావాలన్నారు. కేంద్రం సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
బసవరాజ రాయరెడ్డి జోస్యం