రాబకొవి అధ్యక్ష స్థానానికి పోటాపోటీ | - | Sakshi
Sakshi News home page

రాబకొవి అధ్యక్ష స్థానానికి పోటాపోటీ

Jul 22 2025 8:25 AM | Updated on Jul 22 2025 8:25 AM

రాబకొవి అధ్యక్ష స్థానానికి పోటాపోటీ

రాబకొవి అధ్యక్ష స్థానానికి పోటాపోటీ

సాక్షి,బళ్లారి: అధికార కాంగ్రెస్‌ పార్టీలో రాయచూరు, బళ్లారి, కొప్పళ, విజయనగర(రాబకొవి) జిల్లాల పాల సమాఖ్య అధ్యక్ష పీఠం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర నాలుగు జిల్లాలకు రాబకొవి అధ్యక్ష ఎన్నికలు ఈనెల 25వ తేదీన జరగనున్నట్లు అధికారులు వెల్లడించిన నేపథ్యంలో అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్‌ పార్టీలోనే కుమ్మలాట, కుర్చీలాట మొదలయ్యాయి. నాలుగు జిల్లాలకు చెందిన రాబకొవి ప్రధాన కేంద్ర కార్యాలయం కూడా నగరంలోని కుమారస్వామి ఆలయ సమీపం ఉంది. ఇక్కడ నుంచి నాలుగు జిల్లాలకు పాల సరఫరా, పాల సేకరణతో పాటు అధికారం కూడా ఇక్కడ నుంచి నడపాల్సి ఉంటుంది. రాబకొవి అధ్యక్ష స్ధానం కోసం ముందుగా డైరెక్టర్లుగా ఎంపిక కావాల్సి ఉండగా, అధికార కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా తీవ్ర పోటీ పడినప్పటికీ నాలుగు జిల్లాల నుంచి 12 మంది డైరెక్టర్ల ఎంపిక ఈనెల 10వ తేదీన జరిగిన నేపథ్యంలో 12 మంది డైరెక్టర్లలో 10 మంది కాంగ్రెస్‌ మద్దతుదారులు, ఇద్దరు బీజేపీ మద్దతు దారులు ఎంపికయ్యారు.

ఆయా జిల్లాల్లో డైరెక్టర్లు వీరే..

దీంతో సహజంగానే అధికార పార్టీకి చెందిన వారే రాబకొవి అధ్యక్ష స్థానం దక్కించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. రాబకొవి పరిధిలో జరిగిన డైరెక్టర్ల ఎన్నికల్లో ఉమ్మడి బళ్లారి జిల్లాలో భీమానాయక్‌, ఐగోళ చిదానంద, రత్నమ్మ, మరుళసిద్ధప్ప, కొప్పళ జిల్లా నుంచి కృష్ణారెడ్డి, మంజునాథ్‌, ఎన్‌.సత్యనారాయణ, రాయచూరు జిల్లా నుంచి అమరగుండప్ప, భీమనగౌడ, ప్రవీణ్‌, సీతాలక్ష్మి కలిపి మొత్తం 12 మంది డైరెక్టర్లు ఎన్నికయ్యారు. వీరితో పాటు ఒకరు ప్రభుత్వంచే నియమించిన డైరెక్టర్‌ హంపయ్య ఉండగా, అఫీషియల్‌ డైరెక్టర్లుగా సహకార శాఖ, డిప్యూటీ డైరెక్టర్‌ పశుసంవర్ధకశాఖ, కేఎంఎఫ్‌ ప్రతినిధిగా ఒకరు ఉండగా, మొత్తం 16 మంది ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మరొకరు ఎన్‌డీడీబీ ప్రతినిధి డైరెక్టర్‌గా ఉన్నప్పటికి, వీరు ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. ఓటింగ్‌లో పాల్గొనే 16 మంది డైరెక్టర్లలో 9 మంది మద్దతు ఎవరికి లభిస్తే వారు రాబకొవి అధ్యక్ష పీఠం దక్కించుకుంటారు.

ఎవరికి మెజార్టీ ఉంటే వారే..

రాబకొవి అధ్యక్ష పీఠం పంచాయతీ సీఎం సిద్దరామయ్య దృిష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే సీఎం సున్నితంగా ఎవరికి డైరెక్టర్ల మద్దతు ఉంటే వారినే అధ్యక్షునిగా ఎంపిక చేసుకోవాలని, ఇందులో తన ప్రమేయం ఉండదని తిరస్కరించినట్లు సమాచారం. రాబకొవి అధ్యక్ష స్థానానికి ఎమ్మెల్యేలు భీమానాయక్‌, రాఘవేంద్ర హిట్నాల్‌ కూడా పోటీ పడుతున్నారనే ప్రచారం జరుగుతున్నా, వాస్తవంగా వీరిద్దరూ తమ మద్దతుదారులను రాబకొవి అధ్యక్ష స్థానంపై కూర్చొపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రాబకొవి అధ్యక్ష స్థానం రేసులో కొప్పళ జిల్లా నుంచి డైరెక్టర్‌గా ఎన్నికై న కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్‌ మద్దతు ఇస్తుండగా, రాయచూరు జిల్లా నుంచి డైరెక్టర్‌గా ఎన్నికై న అమరగుండప్పకు భీమానాయక్‌ మద్దతు ఇస్తున్నారని, ఈనేపథ్యంలో రాబకొవి అధ్యక్ష స్థానం కోసం కృష్ణారెడ్డి, అమరగుండప్పలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అధ్యక్ష స్థానం ఏకగ్రీవం చేసుకోవాలని సీఎం దృష్టికి నేతలు తీసుకెళ్లినప్పటికీ, సమస్య జఠిలంగా ఉండటంతో అధికార పార్టీ తరపున ఎన్నికై న డైరెక్టర్ల మధ్యనే ఎన్నిక అనివార్యం కానుంది.

పావులు కదుపుతున్న నాయకులు

రాబకొవి అధ్యక్ష స్థానంతో పాటు కేఎంఎఫ్‌(కర్ణాటక మిల్క్‌ఫెడరేషన్‌) అధ్యక్షుడుగా పని చేసిన ఎమ్మెల్యే భీమానాయక్‌ ఈసారి కూడా అవకాశం దొరికితే తానే రాబకొవి అధ్యక్ష పదవిని దక్కించుకోవాలని లేదా కేఎంఎఫ్‌ ప్రతినిధిగా వెళ్లి మళ్లీ కేఎంఎఫ్‌ అధ్యక్షుడు కావాలని పావులు కదుపుతున్నారు. భీమానాయక్‌కు చెక్‌ పెట్టేందుకు కొప్పళ ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్‌ కేఎంఎఫ్‌ ప్రతినిధిగా వెళ్లేందుకు లేదా రాబకొవి, కేఎంఎఫ్‌ రెండింటిలో ఏదైనా ఒక అధ్యక్ష స్థానం ఈసారి తనకే కావాలని పట్టు బడుతున్నారు. ఒకసారి రాబకొవి, మరోసారి కేఎంఎఫ్‌ అధ్యక్ష స్థానాలను అనుభవించిన భీమానాయక్‌ను తప్పించి తనకే అవకాశం కల్పించాలని సీఎం వద్ద రాఘవేంద్ర హిట్నాల్‌ గట్టిగా పట్టుబట్టినట్లు సమాచారం. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలకు చెందినవారు రాబకొవి డైరెక్టర్లు ఎవరికి మద్దతు ఇస్తారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌తో పాటు బీజేపీకి చెందిన డైరెక్టర్లు, నామినేటెడ్‌ డైరెక్టర్లు కీలకంగా మారే అవకాశం ఉంది. వీరి మద్దతు కూడగట్టుకునేందుకు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎవరిని వరించేనో పాల సమాఖ్య

అధ్యక్ష పీఠం

ఈనెల 25న అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement