
డి గ్యాంగ్ తరహాలో దాడి
దొడ్డబళ్లాపురం: సినీ నటుడు దర్శన్, ఆయన అనుచరుల చేతిలో చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకు గురైన కేసు గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడకు అశ్లీల మెసేజ్‌లు పంపడంతో అతన్ని పిలిపించి హత్య చేశారని కేసు నమోదైంది. అదే మాదిరి సంఘటన తాజాగా ఒకటి జరిగింది. బెంగళూరు వద్ద నెలమంగల తాలూకా సోలదేనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన వెలుగు చూసింది. వివరాలు.. బాధితున్ని కుశాల్‌గా గుర్తించారు.
లవర్‌ను మార్చేయడంతో..
కుశాల్ రెండేళ్లుగా ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె మరొకరితో ప్రేమాయణం ఆరంభించింది. ఆ కోపంతో యువతికి అశ్లీల మెసేజ్‌లు పంపించాడు. సదరు యువతి తన స్నేహితులకు విషయం చెప్పింది. వారంతా కలిసి కారులో కుశాల్‌ను కిడ్నాప్ చేసి ఆలూరు వద్ద నిర్జన ప్రదేశంలోని తీసికెళ్లి నగ్నంగా చేసి చావబాది వీడియో తీశారు. ఇది కూడా దర్శన్ కేసు వంటిదే అవుతుందని నిందితులు గొప్పలు చెప్పుకున్నారు. బాధితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నాడు. ఈ కేసులో హేమంత్, యశ్వంత్, శివశంకర్ , శశాంక్‌గౌడతో పాటు మొత్తం 8మందిని సోలదేనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు.
నెలమంగల వద్ద రౌడీయిజం
బాధితునికి తీవ్ర గాయాలు
8 మంది అరెస్టు