
మరుపురాని మహానాయకుడు వైఎస్సార్
సాక్షి,బళ్లారి: పువ్వు పుట్టగానే పరమళిస్తుందని పెద్దలు అంటారు. మహానుభావులు, మహానేతలు కూడా చిన్నప్పటి నుంచి అందరికీ కన్నా భిన్నంగా ఉంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడం చరిత్ర ఆధారాల ద్వారా ఎందరో మహానుభావుల గురించి అవగతం అవుతుంది. భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రాజకీయ నేతల్లో ప్రముఖ వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరు. ఆయన బళ్లారిలో చదువుతున్న రోజుల్లోనే చిన్నప్పటి నుంచి విభిన్నమైన వ్యక్తిత్వంతో పలువురికి సేవ చేయాలనే తపన, చురుకుదనం, తోటి విద్యార్థులకు అండగా ఉంటూ ఇలా చెప్పుకుంటూ ఎన్నో సుగుణాలు కలిగిన మహానేత వైఎస్సార్ బళ్లారిలో చదవడంతో ఆయనకు నాయకత్వ లక్షణాలు సేవాగుణం బళ్లారి నుంచి బీజం పడింది. 1958లో తండ్రి రాజారెడ్డి బళ్లారిలో కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న సమయంలో ఆయన బళ్లారిలో ఫ్యామిలీ పెట్టారు. అదే సందర్భంలో వైఎస్సార్‌తో పాటు ఆయన సోదరుడు, సోదరిని కూడా బళ్లారిలో విద్యాభ్యాసం చేయించారు. వైఎస్ రాజారెడ్డి సంతానంలో అందరి కంటే ఎంతో తెలివిపరుడుగా వైఎస్సార్ చిన్నప్పటి నుంచి తన ప్రతిభను చూపేవారు.
పేద విద్యార్థులకు చేదోడుగా..
ఈనేపథ్యంలో హాస్టల్‌లో ఉన్నప్పుడు కూడా తోటి విద్యార్థులకు ఎంతో అండగా ఉండటమే కాకుండా పేద విద్యార్థులకు ఫీజులు కూడా చెల్లించేవారని, తండ్రి రాజారెడ్డి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుల్లో ఆయన తోటి విద్యార్థులకు ఫీజులు కట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తోటి మిత్రులు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చిన దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఏపీలోనే కాకుండా కర్ణాటకలో కూడా వైఎస్సార్‌పై జనంలో చెరగని ముద్ర ఉంది. ముఖ్యంగా బళ్లారి జిల్లాతో వైఎస్సార్‌కు విడదీయరాని బంధం ఉంది. ఆయన 7వ తరగతి నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీతో పాటు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే బళ్లారిలో ఆరు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేశారు. అనంతరం డిగ్రీ బళ్లారి నగరంలోని వీరశైవ కళాశాలలో చదువుతుండగానే కర్ణాటకలోని గుల్బర్గా(కలబుర్గి)లో ఎంబీబీఎస్ సీటు రావడంతో అక్కడ చదివి డాక్టర్ అయ్యారు. ఎంబీబీఎస్ కూడా కలబుర్గిలో పూర్తి చేయడంతో ఆయన విద్యాభాస్యం దాదాపు కర్ణాటకలోనే కొనసాగిందని చెప్పవచ్చు.
పాత మిత్రులను ఏనాడూ మరువలేదు
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జరిగిన సంఘటనలు ఎన్నటికీ మరిచిపోయేందుకు వీలు ఉండదు. అదే విధంగా మహానేత వైఎస్సార్ కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్ననాటి మిత్రులను, చదివిన పాఠశాలను ఆయన ఎప్పుడూ గుర్తు చేసుకునేవారట. అంచెలంచెలుగా స్వశక్తితో ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా సంక్షేమ పథకాలు అమలు చేసి సంక్షేమ రథసారథిగా పేరు తెచ్చుకుని భూమి, ఆకాశం ఉన్నంత వరకు ఆయన పేరును మరిచిపోలేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఆయన గత జ్ఞాపకాలను చెరగని విధంగా నెమరువేసుకుంటున్నారు. ఇప్పటికీ బళ్లారిలోని ఆయన స్నేహితులు వైఎస్సార్‌తో ఉన్న అనుబంధం, పరిచయాలను మరవలేకపోతున్నారు. వైఎస్సార్‌లో చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు, పది మందికి సేవ చేసే గుణం, నమ్మకం, స్నేహానికి ప్రతిరూపంగా, నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికై నా సిద్ధపడే ధీరత్వం ఉండేదని ఆయన స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు.
బళ్లారితో వైఎస్సార్ బంధం విడదీయరానిది
నాయకత్వ లక్షణాలకు బళ్లారి నుంచే బీజం
హాస్టల్, పాఠశాలల్లో చురుకుగా ఉండేవారు
నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
సందర్భంగా ప్రత్యేక కథనం

మరుపురాని మహానాయకుడు వైఎస్సార్