2 నెలలు మృత్యువుతో పోరాడి.. | - | Sakshi
Sakshi News home page

2 నెలలు మృత్యువుతో పోరాడి..

Jul 7 2025 6:32 AM | Updated on Jul 7 2025 6:50 AM

శివమొగ్గ: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఏఎస్‌ఐ రెండు నెలలకు పైగా మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయారు. వివరాలు.. శివమొగ్గ జిల్లాలో ఆనవట్టి ఠాణాలో ఏఎస్‌ఐ బసవరాజప్ప (50) ఏప్రిల్‌ నెల 30వ తేదీన రాత్రి బైక్‌లో శిరాళకొప్పకు వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన బసవరాజప్పని ప్రజలు ఆస్పత్రిలో చేర్పించారు. కుటుంబీకులు మెరుగైన చికిత్స కోసం మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు ఎంత చికిత్స చేసినా ఆయన కోలుకోలేదు. దాంతో కుటుంబసభ్యులు ఆయనను ఇటీవల శికారిపుర పట్టణంలో ఉన్న ఇంటికి తీసుకుని వచ్చారు. శనివారం రాత్రి కన్నుమూశారు.

లాడ్జిలో ఎస్‌ఐ ఆత్మహత్య

6 రోజుల తరువాత వెలుగులోకి

తుమకూరులో సంఘటన

తుమకూరు: తుమకూరు నగరంలోని ఓ లాడ్జిలో దావణగెరెకు చెందిన ఎస్‌ఐ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఎస్‌ఐ నాగరాజు (35) దావణగెరె ఎక్స్‌టెన్షన్‌ ఠాణాలో ఎస్‌ఐగా పనిచేసేవారు. ఆదివారం లాడ్జ్‌ గదిలో నుంచి దుర్వాసన రావడంతో సిబ్బంది వెళ్ళి చూడగా విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి గాలించగా 2 పేజీల డెత్‌నోట్‌ లభించింది. ఈ నెల 1వ తేదీన నాగరాజు లాడ్జికి వచ్చినట్లు సమాచారం. ఎస్‌ఐ అని చెప్పి రూంని తీసుకున్నారు. గదిలోకి వెళ్ళిన నాగరాజు మళ్లీ బయటికి రాలేదు. లాడ్జ్‌ సిబ్బంది ఫోన్‌ చేసినా స్పందన లేదు. శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుటుంబ సమస్యలే కారణమని డెత్‌నోట్‌లో రాసినట్లు తెలిసింది.

కారు– బస్సు ఢీ,

ముగ్గురు దుర్మరణం

దొడ్డబళ్లాపురం: కేఎస్‌ ఆర్టీసీ బస్సు కారు– ముఖాముఖి ఢీకొన్న ప్రమాదంలో కారులో ఒకే కుటుంబానికి ముగ్గురు మృతిచెందిన సంఘటన బెళగావి జిల్లా అథణి తాలూకా మురగుండి గ్రామం వద్ద జరిగింది. కల్బుర్గి జిల్లా అఫ్జల్‌పురకు చెందిన గిరీష్‌, రాహుల్‌, సంగు అమరగొండ మరణించారు, రాధిక అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరంతా కొల్హాపుర మహాలక్ష్మి దేవాలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్‌ర్టీసీ బస్సు ఢీకొంది. కారు గుర్తుపట్టలేనంతగా తుక్కు తుక్కయింది. అథణి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నేస్తమా.. తిరిగి రావా!

ఎద్దు సమాధి చెంత శునకం ఘోష

మైసూరు: పిచ్చి కుక్క కరిచి రేబిస్‌ వ్యాధితో మరణించిన మైసూరులో మేటగళ్లి మహాలింగేశ్వర ఆలయ వృషభం మిత్రుడు, వీధి శునకం ఆవేదన చెప్పనలవి కాదు. తన మిత్రుడు సమాధి నుంచి వస్తాడా.. అని అక్కడే వేచిచూస్తోంది. అది చూసి గ్రామస్తులకు కంటనీరు ఆగడం లేదు. ఆలయ ఎద్దుకు రేబీస్‌ సోకి వారం కిందటే చనిపోవడం, గ్రామస్తులు ఎద్దును ఆలయం పక్కనే ఖననం చేసి సమాధి నిర్మించడం తెలిసిందే. బసవతో బంధాన్ని పెంచుకొన్న శునకం అక్కడే తిరుగాడుతోంది. ఆదివారం జరిగిన సమారాధనలో శునకం కూడా పాల్గొంది. సమాధి దగ్గర ఉంచిన ఎద్దు చిత్రపటం ముందు బాధతో కూర్చుంది.

2 నెలలు మృత్యువుతో పోరాడి.. 1
1/3

2 నెలలు మృత్యువుతో పోరాడి..

2 నెలలు మృత్యువుతో పోరాడి.. 2
2/3

2 నెలలు మృత్యువుతో పోరాడి..

2 నెలలు మృత్యువుతో పోరాడి.. 3
3/3

2 నెలలు మృత్యువుతో పోరాడి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement