
గుండెపోటుకు నవ వరుడు బలి
దొడ్డబళ్లాపురం: రెండున్నర నెలల క్రితం వివాహమైన కొత్త పెళ్లికొడుకును గుండెపోటు పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన గుండెపోటు మరణాలతో సతమతమవుతున్న హాసన్ జిల్లాలోనే జరిగింది. హొళేనరసీపుర తాలూకా సోమనహళ్లివాసి సంజయ్ (27)కు ఇటీవలే పెళ్లయింది. సోమవారంనాడు స్నేహితులతో పార్టీ చేసుకున్న సంజయ్ తరువాత గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో స్నేహితులు గ్రామంలోని ఆరోగ్య కేంద్రానికి తీసికెళ్లారు. అక్కడ బీపీ చెక్ చేయగా 220 ఉన్నట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే మృతిచెందాడు. అయితే మృతుని కుటుంబ సభ్యులు అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
శివమొగ్గలో విద్యార్థి..
శివమొగ్గ: గుండెపోటుతో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన నగర శివార్లలోని బసవనగంగూరు గ్రామంలో జరిగింది. మృతుడు శ్రీనిధి (20) అనే విద్యార్థి. ఇతను నగరంలోని డీవీఎస్ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం శ్రీనిధికి అస్వస్థత కలిగింది, వెంటనే అతనిని నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిసింది. గుండెపోటు, న్యుమోనియా కారణమని వైద్యులు చెప్పినట్లు గ్రామ నివాసి ప్రసన్న తెలిపారు. యువకుని ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదం అలముకొంది.
హాసన్ జిల్లాలో విషాదం

గుండెపోటుకు నవ వరుడు బలి