
సమస్యల సుడిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు
బళ్లారి అర్బన్: నగర నడిబొడ్డున ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం స్థాపించి ఎన్నో దశాబ్దాలు గడిచినా ఆ ఆవరణలోని పరిస్థితులు మాత్రం కొంచెం కూడా మారలేదు. దీనికి నిదర్శనమే మంగళవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి ఈ కార్యాలయ ప్రాంగణం అంతా జలమయం అయింది. పార్కింగ్ సౌకర్యం లేక ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. ఇది ఒక రోజు పరిస్థితి కాదు. కొద్దిపాటి వర్షానికే ఈ ఆవరణ అంతా బురదమయంగా మారుతుంది. దీంతో కార్యాలయానికి వచ్చే సామాన్యులు అడుగు తీసి అడుగు వేయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. సాధారణంగా ప్రతి ఏటా తమ కార్యాలయ నిర్వహణ ఖర్చుల బాపతుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఈ కార్యాలయ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారో తెలియదు కానీ గత 30 ఏళ్లుగా ఇదే దుస్థితి నెలకొందని అక్కడికి వచ్చే సామాన్యులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఆ కార్యాలయ ఉన్నతాధికారులు సదరు ఆవరణను బాగు చేయడానికి ఈ వర్షాకాలానికి ముందే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే డీసీ, తహసీల్దార్ తదితర కార్యాలయాలు రాజ్‌కుమార్ రోడ్డులోని మినీ విధాన సౌధకు తరలించిన తరహాలోనే ఈ కార్యాలయాన్ని కూడా అక్కడికి తరలిస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
రిజిస్టేషన్ల ద్వారా ప్రభుత్వానికి
కాసుల వర్షం
దశాబ్దాలుగా మారని
కార్యాలయ ఆవరణ తీరు

సమస్యల సుడిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు