
5 రైల్వేస్టేషన్లకు హంగులు
శివాజీనగర: అమృత్ భారత్ కింద దేశంలో పలు రైల్వే స్టేషన్‌లను ఆధునీకరించారు. ఇందులో కర్ణాటకకు చెందిన ఐదు రైల్వే స్టేషన్‌లు కొత్త సౌలభ్యాలను సంతరించుకున్నాయి. ధారవాడ, గదగ్, గోకాక్, మునీరాబాద్, బాగలకోట రైల్వే స్టేషన్లను ఆధునికంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో 50కి పైగా స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు, దశలవారీగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
అత్యాచారం కేసులో టీవీ నటుడు అరెస్టు
బనశంకరి: అత్యాచారం కేసులో పరారీలో ఉన్న టీవీ నటుడు మాదనూరు మను ను గురువారం బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరినగర పోలీసులు అరెస్ట్‌చేశారు. అత్యాచారం కేసు నమోదైన వెంటనే హాసన్‌లోని మాదనూరులో తలదాచుకున్నాడు. పోలీసులు గాలించి నిర్బంధించారు. కామెడీ ఖిలాడిగళు అనే టీవీ షోలో మను నటిస్తున్నాడు. మరో సినిమాలోనూ చిన్న పాత్ర చేస్తున్నారు. టీవీ షోలో సహ నటి ఫిర్యాదు చేసింది. తనను ప్రేమ, పెళ్లి పేరుతో లోబర్చుకున్నాడని, రెండుసార్లు అబార్షన్ చేయించాడని, పెళ్లి చేసుకోమని అడిగితే తిరస్కరించాడని ఫిర్యాదులో ఆరోపించింది.
సిట్‌కు మునిరత్న కేసు
బనశంకరి: మహిళను వివస్త్రను చేసి అనుచరులతో అత్యాచారానికి పాల్పడి వైరస్ సోకే ఇంజెక్షన్ వేసిన ఆరోపణలతో ఆర్‌ఆర్ నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న పై నగర ఆర్‌ఎంసీ యార్డు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును సర్కారు సిట్‌కు అప్పగించింది. మునిరత్న పై నమోదైన పలు కేసుల దర్యాప్తు కోసం గత ఏడాది ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. మునిరత్న పై కగ్గలిపుర ఠాణాలో అత్యాచారం కేసు, వయ్యాలికావల్ ఠాణాలో నమోదైన కులదూషణ, ప్రాణ బెదిరింపులు కేసులను సిట్ విచారిస్తోంది. ఈ కేసును కూడా అప్పగిస్తూ ఫైళ్లను సిట్ బృందానికి అందజేశారు.
ప్రొఫెసర్ ఇంట్లో చోరీ
మైసూరు: వారసత్వ నగరిలో దొంగల గోల పెరిగిపోయింది. ఇంటి బాల్కనీ నుంచి లోపలకు చొరబడిన దొంగలు అల్మరాలో భద్రపరిచిన రూ.15.60 లక్షల విలువ చేసే 195 గ్రాముల బంగారు నగలు, డబ్బును దోచుకున్నారు. మైసూరులోని విజయనగర మొదటి స్టేజ్‌లో జరిగింది. ఉద్యానవన వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డాక్టర్ మంజునాథ్, మండ్యలోని వీసీ ఫాంలో ప్రొఫెసర్‌గా భార్య డాక్టర్ సుమ పని చేస్తున్నారు. ఇద్దరూ విధులకు వెళ్లిన సమయంలో దుండగులు ఇంటి బాల్కనీ నుంచి లోపలకు ప్రవేశించి గదిలోని అల్మారాలో దాచిన డబ్బు బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితులు విజయనగర ఠాణాలో ఫిర్యాదు చేశారు.
పెళ్లిపీటల నుంచి పరీక్షలకు
యశవంతపుర/ మైసూరు: పెళ్లి మండపంలో తాళి కట్టగానే, నవవధువు నేరుగా పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసింది. హాసన్ నగర చన్నపట్టణ లేఔట్‌కు చెందిన కవన హాసన్‌లో డిగ్రీ చివరి ఏడాది చదువుతోంది. ఆమెకు దినేశ్‌తో గురువారం ఉదయం 9 గంటలకు వివాహం జరిగింది. అదేరోజు పరీక్ష కూడా ఉంది. మాంగళ్య ధారణ కాగానే తమ్ముడు కార్తీక్‌తో బైక్‌మీద పరీక్షా కేంద్రానికి చేరుకొని పరీక్ష రాసింది. ఇదే మాదిరి సంఘటన చామరాజనగర జిల్లా కొళ్లేగాలలో జరిగింది. కొళ్లేగాల వాసవి కాలేజీలో బీకాం చివరి ఏడాది చదివే ఆర్.సంగీతకు కొళ్లేగాల పట్టణంలో స్థానికు వరునితో పెళ్లి ఘనంగా జరిగింది. తర్వాత వెంటనే పెళ్లి దుస్తుల్లోనే సంగీత కొళ్లేగాలకు పరీక్ష రాయడానికి వెళ్లింది. ఈ హడావుడి చూసి అతిథులు ఆశ్చర్యపోయారు.
ఏనుగు దాడిలో మహిళ బలి
మైసూరు: అడవి ఏనుగు దాడిలో ఓ ఆదివాసి మహిళ మరణించగా, మరొకరు గాయపడిన ఘటన జిల్లాలోని హెచ్‌డీకోటె తాలూకాలోని బళ్లె అటవీ ప్రాంతంలో బుధవారం జరిగింది. బళ్లెహాడి నివాసి రాజు భార్య సీత (46) మృతురాలు. సీత, భర్త రాజు, కుమారుడు రాజేష్, బంధువు సుదీప్ నలుగురూ బళ్లె అడవిలోకి వెళ్లి తేనెను సేకరించి గ్రామానికి తిరిగి వస్తుండగా దారి మధ్యలో అడవి ఏనుగు దాడి చేసింది. గాయపడిన సీత, సుదీప్, కుమారున్ని తరలిస్తుండగా మార్గమధ్యలో సీత చనిపోయింది. సుదీప్‌కు కాలు విరిగింది. పోలీసులు, అధికారులు స్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాధితులను ఎమ్మెల్యే అనిల్ చిక్కమాదు పరామర్శించారు. అటవీ అధికారులు ఎవరూ ఆస్పత్రికి రాలేదని మండిపడ్డారు. అటవీ హక్కు చట్టం ప్రకారం ఆదివాసీలు అడవికి వెళ్లి తేనెను సేకరించే అవకాశం ఉంది. నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు.