
వర్షం వెలసింది.. కష్టం మిగిలింది
సాక్షి,బళ్లారి: ఈసారి ముందస్తుగానే భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉమ్మడి బళ్లారి జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో రోడ్లలో ఎక్కడబడితే అక్కడ నీరు నిలిచిపోయాయి. పలు వంకలు, వాగులు భారీ ఎత్తున ప్రవహించాయి. అయితే గురువారం వర్షం ఆగిపోయినా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా వారం రోజుల పాటు లోతట్టు ప్రాంతాల్లో నీరు వంకలు, వాగుల తరహాలో నిలిచిపోతున్నాయి. దీంతో ఆయా రోడ్లు దాటాలంటే జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చెరువులా అండర్‌పాస్
రంగమందిరం సమీపంలోని అండర్‌పాస్ చెరువును తలపిస్తోంది. భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో అటు, ఇటు వచ్చిపోయే వాహనదారులు ఎలా వెళ్లాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లలో వర్షం నీరు నిలిచిపోయి ఓ వైపు ఇబ్బందులు సృష్టిస్తుంటే, మరో వైపు ఏపీఎంసీ బురదమయంగా మారడం షరా మామూలైంది. వర్షం వచ్చినప్పుడల్లా వారం రోజుల పాటు బురదలో కూరగాయలు, ఆకుకూరలు అమ్ముతుండటం వల్ల జనం కూడా గత్యంతరం లేక వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఏపీఎంసీ అధికారులు, స్థానిక పాలకులు ఏపీఎంసీని బాగు చేయాలన్న కనీస ఆలోచన చేయకపోవడం వల్ల ఏపీఎంసీ బురదలో వ్యాపార కేంద్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని సిరుగుప్ప తాలూకాలో భారీ వర్షానికి రారావి, ముదేనూరు గ్రామాల్లో పాత మట్టిమిద్దెలు కూలిపోయి పేదలకు నిలువ నీడ లేకుండా పోయింది.
వానతో జనజీవనం అస్తవ్యస్తం
లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు
బురదమయంగా ఏపీఎంసీ మార్కెట్