నందికొండకు రోప్ వే అండ!
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, టూరిస్టులు, ప్రేమికుల స్వర్గధామంగా పేరుపొందిన నంది కొండకు నిత్యం వేలాదిమంది వస్తుంటారు. నేల మీద నుంచి కొండ మీదకు రోప్ వే ను వేసి కేబుల్ కార్లను నడపాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో పథకానికి అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చింది, అటవీ సంపదకు భంగం కలగకుండా రోవ్ వే వేసుకోవచ్చని, నిర్మాణంలో జేసీబీలను వాడరాదని, ఎలాంటి రోడ్లు వేయరాదని షరతులతో ఆమోదం వచ్చింది. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఎంసి సుధాకర్, కలెక్టర్ రవీంద్ర మంగళవారం తెలిపారు. రోప్ వేకు సరైన స్థలం కోసం నందిహిల్స్ మీద పరిశీలన జరిపారు.
2.93 కిలోమీటర్ల రోప్‌వే
సుమారు 2.93 కిలోమీటర్ల పొడవైన రోప్ వే అవసరమని, ఇందుకు 7 ఎకరాల భూమి కావాలని తెలిపారు. పథకానికి రూ. 93.40 కోట్లు ఖర్చవుతుందని, పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని తెలిపారు. రెండు సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వనున్నట్లు చెప్పారు. రోప్ వే ఏర్పాటైతే కొండ మీదకు వాహనాల రద్దీ తగ్గనుంది. కొత్త పర్యాటక సౌకర్యం కూడా అవుతుంది. మాటలకే పరిమితం కాకుండా పథకం ఎప్పుడు పూర్తవుతుందా అని టూరిస్టులు, జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
అటవీశాఖ అనుమతి
మంత్రిచే స్థల పరిశీలన
నందికొండకు రోప్ వే అండ!


