
మిస్టరీగా శాస్త్రవేత్త నిష్క్రమణం
మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలోని సాయి ఆశ్రమం సమీపంలో ఉన్న కావేరి నదిలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ (70) మృతదేహం లభించింది. మైసూరు నగరంలోని విశ్వేశ్వరయ్య పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అక్కమహాదేవి రోడ్డులో ఓ అపార్టుమెంటులో భార్యతో కలిసి జీవించేవారు. ఆయన 7వ తేదీన ఇంటి నుంచి వెళ్లి మళ్లీ కనిపించలేదు. దాంతో కుటుంబ సభ్యులు మైసూరు విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలుచోట్ల సీసీ కెమెరాలను పరిశీలించగా స్కూటర్‌లో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇలా వెతుకున్న సమయంలో శనివారం నదిలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు, వెళ్లి చూడగా అయ్యప్పన్ అని గుర్తించారు. సమీపంలో ఆయన స్కూటర్ కూడా కనిపించింది. ఇంటికి, ఇక్కడకు సుమారు 20 కి.మీ. దూరం ఉంది. మృతదేహాన్ని మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించారు. శ్రీరంగ పట్టణ పోలీసులు ఆయన మృతిపై దర్యాప్తు ప్రారంభించారు. ఎలాంటి డెత్‌నోట్ లభించలేదు.
వ్యవసాయ సంస్థల అధిపతిగా
అయ్యప్పన్ చామరాజనగర జిల్లాలోని యళందూరులో జన్మించారు. చిన్ననాటి నుంచే చదువుల్లో మేటిగా నిలిచారు. మంగళూరులో మత్స్యశాస్త్రంలో ప్రత్యేక డిగ్రీ కోర్సు చేశారు. తరువాత బెంగళూరు అగ్రి వర్సిటీలో వ్యవసాయ శాస్త్రంలో పీహెచ్‌డీని అందుకున్నారు. ఆపై ప్రసిద్ధ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రి రీసెర్చ్ (ఐసీఏఆర్)లో సైంటిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. వ్యవసాయం, చేపల పెంపకం రంగాలలో అనేక నూతన ఆవిష్కారాలకు నాంది పలికారు. కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ విభాగాల్లో ముఖ్య పదవులను చేపట్టారు. ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. దేశంలో ప్రధాన నగరాలలో పనిచేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్రం 2022లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇతరత్రా అనేక పురస్కారాలను ఆయనను వరించాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రిటైరయ్యాక మైసూరులో స్థిరపడ్డారు.
మృతదేహం దొరికిన ప్రదేశం
మహోన్నత వ్యవసాయ శాస్త్రవేత్త విషాదాంతంపై రైతు సంఘాలు, మేధావి వర్గాలు తీవ్ర విచారాన్ని వ్యక్తంచేశాయి. ఆయన మరణంపై అనుమానాలున్నాయని, కోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఓ శాస్త్రవేత్త డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు లేఖలు రాశారు. ఐసీఏఆర్, అనుబంధ సంస్థల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. దీంతో కొందరు ఆయనపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఈ వేధింపులను భరించలేక ఇలా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని వేణుగోపాల్ బదరవాడ అనే మాజీ సైంటిస్టు ఆరోపించడంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో జరిగే అక్రమాలకు ఈ దారుణం అద్దం పడుతోంది, రైతు సంఘాలు కూడా గతం నుంచి ఇవే ఆరోపణలు చేస్తున్నాయి అని ఆయన అన్నారు. మండ్య జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి మాట్లాడుతూ విచారణ చేపట్టినట్లు తెలిపారు.
సీబీఐ దర్యాప్తు కోసం
ప్రధానికి లేఖ
దేశంలో అతి కొద్ది మంది ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్తల్లో ఒకరు, ప్రముఖ వ్యవసాయ పరిశోధనా సంస్థలకు సారథ్యం వహించిన కన్నడిగుడు సుబ్బన్న అయ్యప్పన్ కావేరి నదిలో శవమై తేలడం శాస్త్రలోకాన్ని దిగ్భ్రమకు గురిచేసింది. ఇందుకు కారణాలు ఏమై ఉంటాయనేది ఇంకా తెలియడం లేదు. రైతులకు, సహచర శాస్త్రవేత్తలకు విషాదమే మిగిలింది.

మిస్టరీగా శాస్త్రవేత్త నిష్క్రమణం

మిస్టరీగా శాస్త్రవేత్త నిష్క్రమణం

మిస్టరీగా శాస్త్రవేత్త నిష్క్రమణం