బనశంకరి: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో 14 కేజీలకు పైగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిన నటి రన్య రావు బెయిలుపై ఉత్కంఠ కొనసాగుతోంది. 3వ తేదీన ఆమె అరెస్టు కాగా డీఆర్‌ఐ విచారణ తరువాత పరప్పన అగ్రహార జైలులో రిమాండులో ఉంద.ఇ రన్య బెయిల్ పిటిషన్‌పై బుధవారం ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. డీఆర్‌ఐ వకీలు అభ్యంతరాలు తెలియజేయడానికి సమయం కావాలని మనవిచేశారు. కోర్టు అనుమతి ఇస్తూ 21 తేదీకి విచారణను వాయిదా వేసింది.
తరుణ్‌రాజు బెయిలుకు నో
రన్యరావు బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన రెండో నిందితుడు, పారిశ్రామికవేత్త తరుణ్‌రాజు బెయిల్ పిటిషన్‌ను ఆర్థిక నేరాల ప్రత్యేకకోర్టు కొట్టివేసింది. రన్యను విచారించిన తరువాత డీఆర్‌ఐ.. తరుణ్‌రాజును అరెస్టు చేసింది.
ఆహారం సురక్షితమేనా?
● బెంగళూరులో అధికారుల తనిఖీలు
యశవంతపుర: బెంగళూరులో వివిధ ఆహార షాపుల్లో ఆహారశాఖ అధికారులు దాడులు చేశారు. వాటిలో అమ్ముతున్న అహార పదార్థాల నాణ్యతలను పరిశీలించారు. మల్లేశ్వరంలోని వివిధ మార్ట్‌లలో ఫుడ్ షాపుల్లో సోదాలు చేశారు. అవధి ముగిసిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. వంట నూనె అంగళ్ళలో తనిఖీలు చేశారు. ఓ షాపులో కోడిగుడ్డును పగలకొట్టి చూడగా నాణ్యత లేదని వెల్లడైంది. గడువు మీరిన సాస్, ఊరగాయ, స్వీట్ ప్యాకెట్, పరోటా, సమోసా, పన్నీరు, చాక్లెట్లు ఉండడంతో నిర్వాహకులకు నోటీసులిచ్చారు. కొన్ని బేకరీలలో కేక్‌లు, ఇతర ఉత్పత్తులను తనిఖీలు చేశారు. ఆరోగ్యానికి హానికరంగా ఉండే రంగులను వాడారా అనేది పరిశీలన చేశారు. ఈ విషయంలో అమ్మాస్ బేకరీకి నోటీసులిచ్చారు. ఉత్తర కర్ణాటక వంటకాలను అమ్మే షాపులలోనూ సోదాలు కొనసాగాయి. పలు షాపుల నుంచి ఆహార శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. నివేదిక వచ్చిన తరువాత తినడానికి మంచిదో, చెడ్డతో తెలుస్తుందని చెప్పారు.
ఆర్టీసీ బస్సు దగ్ధం
దొడ్డబళ్లాపురం: వెళుతున్న బస్సులో మంటలు చెలరేగి కాలిపోయిన సంఘటన బీదర్ జిల్లా ఔరాద్ తాలూకా కప్పికేరి క్రాస్‌లో చోటుచేసుకుంది. ఔరాద్ డిపోకు చెందిన బస్సు బీదర్ నుంచి ఔరాద్‌కు వెళ్తోంది. దారిలో ఓచోట బస్సు ఇంజిన్‌లో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్, కండక్టర్ బస్సులోని ప్రయాణికులను కిందకు దించేశారు. బస్సు నుంచి దట్టమైన పొగ ఆవహించింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. ప్రమాదాన్ని చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
గూడ్స్ వ్యాన్ బీభత్సం
● ఇద్దరు దుర్మరణం
కృష్ణరాజపురం: బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హొసకోటె తాలూకా జడిగేనహళ్లి వద్ద నూతన చైన్నె ఎక్స్‌ప్రెస్ హైవేలో రోడ్డు ప్రమాదం జరిగింది. గూడ్స్ వ్యాన్, ద్విచక్రవాహనాన్ని ఢీకొని ఈడ్చుకుని వెళ్లడంతో ఇద్దరు బలయ్యారు. హొసకోటెకు చెందిన ఖాదర్ మొహిద్దీన్ (45), రాజా(42)లు స్థానికంగా చిన్న వ్యాపారం చేసుకునేవారు. పనిమీద టీవీఎస్ మోపెడ్‌పై వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ వ్యాన్ వారిని ఢీకొని కొంతదూరం ఈడ్చుకుపోయింది. దీంతో ఖాదర్, రాజాల శరీరాలు ఛిద్రమయ్యాయి. హైవేలో దూరదూరంగా పడిపోయాయి. స్థలానికి హొసకోటె పోలీసులు చేరుకుని పరిశీలించారు. గూడ్స్ వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిసింది.
రన్యరావు బెయిలు అర్జీ వాయిదా
రన్యరావు బెయిలు అర్జీ వాయిదా