
యశవంతపుర(కర్ణాటక): ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తివేటుకు బలి చేశాడు కర్కోటక భర్త. ఈ ఘటన చిక్కమగళూరు తాలూకా కైమరా చెక్‌పోస్టు వద్ద జరిగింది. అవినాశ్(32) కీర్తి(26)లు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రెండన్నరేళ్ల చిన్నారి ఉంది. వీరి సంసారం సవ్యంగా సాగుతుండగా ఇటీవల కలతలు ఏర్పడ్డాయి. విడాకులు ఇవ్వాలని అవినాశ్ ఒత్తిడి చేసేవాడు. భార్య నాలుగు నెలల గర్భిణిగా ఉండగా అబార్షన్ చేయించినట్లు తెలిసింది.
కొంతకాలంగా పుట్టింటిలో ఉన్న కీర్తి బట్టలు తీసుకురావటానికి బుధవారం భర్త వద్దకు వచ్చింది. ఆ సమయంలో అవినాశ్ కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. చుట్టు పక్కలవారు గమనించి బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందింది. అవినాశ్ అక్క వల్లనే తమ కుమార్తె కాపురంలో కలతలు ఏర్పడ్డాయని మృతురాలి తల్లిదండ్రులు చిక్కమగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పరారీలో ఉన్న అవినాశ్ కోసం గాలింపు చేపట్టారు.