అంగన్‌వాడీల ధర్నా | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల ధర్నా

Published Thu, Mar 20 2025 12:50 AM | Last Updated on Thu, Mar 20 2025 12:49 AM

బనశంకరి: 2025– 26 బడ్జెట్‌లో గౌరవ వేతనాన్ని అత్తెసరే పెంచారని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ఫ్రీడం పార్కులో ధర్నా చేశారు. ఏఐటీయుసీ తదితర కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. ఈ బడ్జెట్‌లో కార్యకర్తకు రూ. 1000, ఆయాకు రూ.750 మాత్రమే పెంచారని చెప్పారు. మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్‌ అక్కడికి వచ్చి వారితో చర్చలు జరిపారు, మీ డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

కుక్కను తప్పించబోయి

బ్యాంకు మేనేజర్‌ బలి

మైసూరు: రోడ్డు మీద కారుకు అడ్డుగా వచ్చిన కుక్క ను కాపాడబోయి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మైసూరు జనతా నగర నివాసి, ఎస్‌ బ్యాంకు మేనేజర్‌ లోహిత్‌ (39) పని నిమిత్తం కారులో బోగాది వద్దనున్న గ్రామానికి వెళ్లాడు. తిరిగి మైసూరుకు పయనమయ్యాడు. ఈ సమయంలో కుమారబీడు సమీపంలో రోడ్డుపై ఒక కుక్క హఠాత్తుగా అడ్డు వచ్చింది. కుక్కను ఢీ కొట్టకుండా తప్పించేందుకు యత్నించి కారును ఎడమ వైపునకు తిప్పాడు. ఈ సమయంలో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. దీంతో లోహిత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతని సోదరుడు వచ్చి లోహిత్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. స్థానిక పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

సిద్దరామయ్యది తుగ్లక్‌ దర్బార్‌

ముస్లిం రిజర్వేషన్లను ఒప్పుకోం: విజయేంద్ర

శివాజీనగర: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును మంగళవారం శాసనసభలో దొంగిలించి, దాచిపెట్టి, ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర ఆరోపించారు. ముస్లింలకు ప్రభుత్వ పనుల్లో 4 శాతం రిజర్వేషన్‌ను ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. బుధవారం విధానసౌధ ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల కళ్లుకప్పి సభలో బిల్లును ప్రవేశపెట్టారు. సిద్దరామయ్య ప్రభుత్వ తుగ్లక్‌ దర్బార్‌ను బీజేపీ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. సభలోను, బయట రిజర్వేషన్లను మేం వ్యతిరేకిస్తున్నాం. అవసరమైతే హైకోర్టులో కేసు వేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ దుష్టపరిపాలనకు పరిమితి లేకుండా పోయింది. కాంగ్రెస్‌వారు మైనారిటీల మెప్పు కోసం సిద్ధమయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పరిపాలించిన కాలంలో అల్పసంఖ్యాకులను ఎందుకు అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. తాము ముస్లింకు వ్యతిరేకులు కాదన్నారు.

ఎయిర్‌పోర్టులో 3 కేజీల కొకై న్‌ సీజ్‌

బనశంకరి: బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్‌ దొరికాయి. ఆఫ్రికాలోని ఘనా దేశానికి చెందిన జెన్నిఫర్‌ అబ్బే అనే మహిళను బుధవారం అరెస్ట్‌ చేసి 3.2 కేజీల కొకై న్‌ ను స్వాధీనం చేసుకున్నారు. ఖతార్‌లోని దోహ నుంచి విమానంలో ఆమె వచ్చింది. అనుమానంతో డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టగా కొకైన్‌ లభించింది. ఇది విలువ మార్కెట్లో రూ.38 కోట్లు చేస్తుందని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

రూ.100 కోట్ల బీడీఏ భూ స్కాం

బనశంకరి: వంద కోట్ల రూపాయలకు పైగా విలువచేసే బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) స్థలాన్ని కొందరు అవినీతి అధికారులు, ప్రముఖ బిల్డర్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారని బీజేపీ నేత ఎన్‌ఆర్‌.రమేశ్‌ చెప్పారు. బెంగళూరు జయనగర మొదటిబ్లాక్‌లోని సిద్దాపుర గ్రామ సర్వే నంబరు 27,3లో 30 గుంటలు (ముక్కాలు ఎకరా) బీడీఏకి చెందినదే. కానీ బీడీఏ అధికారులు కుమ్మకై ్క అశోక్‌ దారివాల్‌ అనే ప్రముఖ బిల్డర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ భూమి విలువ వంద కోట్ల రూపాయలని చెప్పారు. తక్షణం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, అతనికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మంత్రి కృష్ణబైరేగౌడ, బీడీఏ కమిషనర్‌ జైరామ్‌ను డిమాండ్‌ చేశారు.

దసరా ఏనుగు రోహిత్‌ పరారీ

బండీపుర అడవిలో ఘటన

మైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బండీపుర పులి అభయారణ్యంలో పెంపుడు ఏనుగు రోహిత్‌ రెచ్చిపోయి మావటీలపైనే దాడి చేసింది. జాతీయ రహదారిలో దూకుడుగా ప్రవర్తించడంతో వాహన చోదకులు భయభ్రాంతులకు గురయ్యారు. బుధవారం ఏనుగును నడిపిస్తూ వెళ్తుండగా గట్టిగా ఘీంకరిస్తూ మావటీలు పార్థసారధి, వెంకటేష్‌లపై దాడి జరిపి గాయపరిచింది. దారిలో వెళ్తున్న వాహనదారుల మీదకు దూసుకెళ్లింది. దానిని ఆపేవారు ఎవరూ లేకపోవడంతో అడవిలోకి పారిపోయింది. గతంలో ఈ ఏనుగును మైసూరు ఉత్సవాల కోసం తీసుకొచ్చారు. కాగా, రోహిత్‌ కోసం గాలిస్తున్నామని, మదం వచ్చి అలా ప్రవర్తించిందని బండీపుర ఏసీఎఫ్‌ నవీన్‌కుమార్‌ అన్నారు. గతంలో ఈ ఏనుగు రాంపుర శిబిరంలో ఉండేది. అయితే ప్రత్యేక శిక్షణ కోసమని బండీపుర శిబిరానికి తీసుకొచ్చారు.

అంగన్‌వాడీల ధర్నా 1
1/1

అంగన్‌వాడీల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement