రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందించాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎడమ కాలువకు మార్చి 31 వరకు నీరు వదలడానికి అధికారులు సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో చేతికొచ్చిన పంట నోటికి రాకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. నీటి గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. నీరు అందించడానికి శాశ్వత పరిష్కారం చేపట్టడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావడం లేదని ఆరోపించారు. నీటి విడుదలకు అవకాశం ఉన్నా అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారన్నారు. తుంగభద్ర డ్యాంలో 56.132 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఔట్ ఫ్లో 11,396 క్యూసెక్కులు కాగా ఎడమ కాలువకు రోజు 3800 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నాయన్నారు. ఏప్రిల్‌లో దాదాపు లక్ష హెక్టార్లలో వరి కోతకు రానున్నందున పంటకు ఏప్రిల్ వరకు నీటిని విడుదల చేస్తే పంట దక్కుతుందన్నారు. పై భాగంలో 1000 అక్రమ పైపు లైన్లు వేసుకున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే గంగాధర నాయక్, రాఘవేంద్ర కుష్టిగి, జంబన్న, శరణప్ప గౌడ, నాగన గౌడ, బసవరాజ్, లింగప్పలున్నారు.