వికటించిన ప్రసాదం | Sakshi
Sakshi News home page

వికటించిన ప్రసాదం

Published Tue, Dec 26 2023 1:42 AM

ఓ ఆలయం వద్ద ప్రసాదాల పంపిణీ  - Sakshi

బనశంకరి: వైకుంఠ ఏకాదశి, హనుమజ్జయంతి నేపథ్యంలో శని, ఆదివారం బెంగళూరు సహా పరిసర ప్రాంతాల్లో పలు ఆలయాల్లో ప్రసాదాలను సేవించిన 200 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. వీరిలో ఓ వృద్ధురాలు మరణించింది. రెండురోజుల నుంచి ఆలయాల్లో వేడుకలు జరగ్గా పెద్దసంఖ్యలో భక్తులు వెళ్లి అక్కడ అందజేసిన ప్రసాదం తిన్నారు. ఆపై పలువురు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. బాధితులు హొసకోటేలో ప్రైవేటు ఆసుపత్రులు, కోలారు, బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చేరారు. బెంగళూరులో సిద్దగంగమ్మ (60) అనే మహిళ మృతి చెందింది. ఈమె హొసకోటే కావేరినగర నివాసి, ఈమె భర్త శివణ్ణ స్థానిక ఆలయం నుంచి లడ్డూ ప్రసాదం తీసుకువచ్చి భార్యకు ఇవ్వగా ఆమె తిని సోమవారం అస్వస్థతకు గురైంది. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా ఫలితం లేక చనిపోయింది.

కలుషితం కావడమే కారణం

ఆస్పత్రుల్లో చేరినవారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారు కోలుకుంటున్నారు. ఆహారం కలుషితం కావడమే దీనంతటికీ కారణమని తెలిసింది. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో వండడం, పంపిణీ చేయడం వల్ల బ్యాక్టీరియా చేరి వాంతులు, విరేచనాలు మొదలై ఉంటాయని డాక్టర్లు తెలిపారు. ఘటనాస్థలానికి హొసకోటే పోలీసులు చేరుకుని పరిశీలించారు.

ల్యాబ్‌కు నమూనాలు

హొసకోటే ప్రభుత్వాసుపత్రి టీహెచ్‌ఓ డాక్టర్‌ సుమా మాట్లాడుతూ సుమారు 4 ప్రైవేటు ఆసుపత్రుల్లో 80 మందికి పైగా చేరారని, ఆహార నమూనాలను ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. కచ్చితమైన కారణం ఏమిటీ అనేది ల్యాబ్‌ నివేదికలో తెలుస్తుందన్నారు. ఎక్కడెక్కడ ప్రసాదం తిన్నారు అనేదానిపై సమాచారం సేకరిస్తున్నామని, కలుషిత నీటిని తాగడం వల్ల అనారోగ్యానికి గురై ఉంటారని మరో వైద్యుడు నాగేష్‌ అన్నారు.

1/1

Advertisement
 
Advertisement