కేకేఆర్‌డీబీని అభివృద్ధి పరచండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో అధికారం చేపట్టిన ప్రభుత్వాలు ప్రాంతీయ అసమానతల నివారణకు ఏర్పాటు చేసిన నిగమ మండలి, బోర్డులను రద్దు చేయాలని అర్థ శాస్త్రవేత్త, ప్రాంతీయ అసమానతల నివారణ పరిష్కార కమిటీ అధ్యక్షుడు గోవిందరావు ఆదివారం బెంగళూరులోని కార్యాలయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు నివేదికను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నంజుండప్ప నివేదిక ఆధారంగా వెనుక బడిన తాలూకాల అభివృద్ధి విషయంలో అలసత్వం చేయడం తగదన్నారు. రాష్ట్రంలో 2024లో ఏర్పాటు చేసిన సమితి రెండేళ్ల తర్వాత నివేదికల ఆధారంగా మలెనాడు, బయలు సీమ, కరావళి, గడి అభివృద్ధి ప్రాధికార మండలి, బోర్డులను రద్దు చేయాలని సూచించారు. కేవలం కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బళ్లారి, బీదర్, విజయ నగర జిల్లాల అభివృద్ధి విషయంలో పూర్తిగా వెనుక బడి ఉందని, అందువల్ల కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలి(కేకేఆర్‌డీబీ)ని కొనసాగిస్తూ అందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్‌లో రూ.44 వేల కోట్లు ప్యాకేజీని ప్రకటించాలన్నారు. కలబుర్గి, బెళగావిలకు నిధులు కేటాయించాలి. 1,160 పబ్లిక్ పాఠశాలలుగా మాదిరిగా బడులు, నీటిపారుదల రంగానికి రూ.10 వేల కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.11,770 కోట్లు, వ్యవసాయ, పరిశ్రమల అభివృద్ధికి రూ.2 వేల కోట్ల చొప్పున నిధులు, కేకేఆర్‌డీబీకి ఏడాదికి రూ.6,380 కోట్లు పెంచాలని సిఫార్సు చేసింది.


