
బనశంకరి: గుజరీ వ్యాపారి ఇంట్లో దొంగలు పడి 3.50 కిలోల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు దోచుకుని ఉడాయించారు. ఈ ఘటన బెంగళూరు తిలక్‌నగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఆర్‌కె గార్డెన్ 2వ క్రాస్, రెండో మెయిన్ రోడ్డులో గుజరీ వ్యాపారి షానవాజ్ ఉంటున్నాడు, కుమార్తె పెళ్లి కోసం నగదు, బంగారు ఆభరణాలను ఇంట్లో భద్రపరిచాడు. ఈ నెల 23న ఇంటికి తాళం వేసుకుని కుటుంబసమేతంగా రామనగర, మండ్యలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు.
బెడ్‌రూం తలుపు స్క్రూ తీసి..
ఈ సమయంలో దుండగులు మొదటి అంతస్తు బెడ్‌రూమ్ తలుపు స్క్రూలు తొలగించి చొరబడ్డారు. బీరువాలో ఉన్న సుమారు 3.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు దోచుకుని ఉడాయించారు. 25 తేదీ అర్ధరాత్రి షానవాజ్ కుటుంబంతో సహా తిరిగి వచ్చాడు. బీరువా తెరిచి ఉండడం చూసి గాభరాపడి వెతగ్గా డబ్బు, బంగారం కనిపించలేదు. ఫిర్యాదు మేరకు తిలక్‌నగర పోలీసులు చేరుకుని డాగ్‌స్క్వాడ్ , వేలిముద్రల నిపుణులతో క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక్కడే దొంగ వచ్చినట్లు సీసీ కెమెరా చిత్రాల్లో రికార్డయింది.