కోలారులో నిమజ్జనానికి వినాయకుడిని తరలిస్తున్న దృశ్యం
సాక్షి,బళ్లారి: వినాయక చవితిని పురస్కరించుకుని మూడు రోజుల నుంచి నగరంలో భక్తిశ్రద్ధలతో జై గణేషా...జైజై గణేషా అంటూ భక్తులు వినాయకున్ని పూజిస్తూ ఆయా కాలనీల్లో చేపట్టిన వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటాయి. నగరంలోని ఎంజీ పెట్రోలు బంక్ సమీపంలోని వరసిద్ధి వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవగ్రహ సమేతంగా సూర్యప్రభ వాహనంపై గణేష్ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకోవడంతో ప్రతి రోజు వేలాది మంది భక్తులు వినాయకుడిని దర్శించుకుని పునీతులవుతున్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాగేంద్ర, ఎమ్మెల్యే భరత్‌రెడ్డిలు వినాయక విగ్రహాన్ని దర్శించుకుని నిర్వాహకుల కృషిని శ్లాఘించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలను మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
గీతాలు, నృత్యాలతో యువత హోరు
నగరంలో ఈసారి రెండు రోజులు వినాయక విగ్రహాలను ప్రతిష్టించడంతో కొన్ని కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను మంగళవారం నుంచి నిమజ్జనం చేశారు. బుధవారం సాయంత్రం నుంచి కూడా నగరంలో పలు కాలనీల నుంచి వినాయక విగ్రహాలను ఊరేగిస్తూ నిమజ్జనాలకు తరలించారు. మోకా రోడ్డులోని వాజ్‌పేయి లేఔట్‌లో ఏర్పాటు చేసిన చంద్రయాన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కాలనీ వాసులు మూడు రోజుల నుంచి భక్తిశ్రద్ధలతో పూజించి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రామాను ప్రదర్శించి చూపరులను అలరించారు. బుధవారం చంద్రయాన్ వినాయకుడి నిమజ్జనం కూడా పూర్తి చేశారు. ఈ సందర్భంగా యువత, మహిళలు గణనాథుడి విగ్రహం ముందు నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. నగరంలోని ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీలతో పాటు ఉపకాలువల వద్ద కూడా నిమజ్జనం చేశారు. గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి పోలీసులు శాంతిభద్రతలను కాపాడటంపై విశేషంగా దృష్టి సారించారు.
హొసపేటెలో...
హొసపేటె: గణేష్ పండుగ సందర్భంగా మూడో రోజు బుధవారం రాత్రి గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించారు. నగరంలోని పటేల్ నగర్, బసవేశ్వర వీధి, అమరావతి, రాజీవ్‌నగర్, ఎంజె నగర్ నెహ్రూ కాలనీ, రాణిపేట, అంబేడ్కర్ నగర్, మెయిన్ బజార్, చిత్తవాడిగి, వాల్మీకి సర్కిల్, బాణదకేరి తదితర ప్రాంతాల్లో మంటపాల్లో కూర్చొబెట్టిన గణేష్ విగ్రహాలను నగర రైల్వేస్టేషన్ రహదారిలోని తుంగభద్ర పవర్ కెనాల్‌లో నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి ముందు విగ్రహాలను ట్రాక్టర్ ట్రాలీపై ఉంచి ప్రముఖ వీధుల్లో ఊరేగించారు. నిమజ్జన సమయంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1072 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ హరిబాబు తెలిపారు.
వైభవంగా నిమజ్జన వేడుకలు
కోలారు: నగరంలోని తిలక్ వినాయక విసర్జన సమితి ఆధ్వర్యంలో గురువారం గాందీవనం వద్ద ప్రతిష్టించిన వినాయక విగ్రహ నిమజ్జన వేడుకలను భజరంగదళ్ కార్యకర్తలు వైభవంగా నిర్వహించారు. నటుడు ధృవసర్జా రాకతో నిమజ్జన వేడుకలు మరింత రక్తి కట్టాయి. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో ఒక దశలో తొక్కిసలాట జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు నగరంలోని గాంధీవనం నుంచి వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్‌లో ఉంచి నగరంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించి అనంతరం అమాని చెరువు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటితొట్టిలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. దారి పొడవునా డీజే సౌండ్‌తో ధద్దరిల్లింది, యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
అంబరాన్నంటిన చవితి సంబరాలు
ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు
హొసపేటెలో గణేష్ విగ్రహ ఊరేగింపులో పాల్గొన్న భక్తులు
బళ్లారిలో భక్తిగీతానికి నృత్యప్రదర్శన
వినూత్నంగా ప్రతిష్టించిన చంద్రయాన్ గణపతి


