సాక్షి, పెద్దపల్లి: ఒకవైపు చిన్నారుల్లో ఎదుగుదల.. మహిళల చేతిలో డిజిటల్ శక్తి.. మరోవైపు.. పెద్దల్లో ఊబకాయం.. మధుమేహం.. ప్రసవాల్లో పెరుగుతున్న సిజేరియన్లు.. పురుషుల్లో మద్యపానం, పొగాకు వినియోగం ఆందోళన కలిగిస్తోంది. 2023–24 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–6) ప్రకారం.. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నాలుగేళ్లలో అనేక రంగాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించింది. కానీ, జీవనశైలి మార్పుతో వచ్చే వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి. పెద్దపల్లిలో 852 మంది, కరీంనగర్‌లో 874, జగిత్యాలలో 897, సిరిసిల్లలో 870 ఇళ్లను సర్వేలో నమూనాలుగా సేకరించారు.
సిజేరియన్లలో ఆందోళన
ఆస్పత్రి ప్రసవాల్లో నాలుగు జిల్లాలు మంచి స్థాయిలో ఉన్నాయి. కరీంనగర్, జగిత్యాలలో 100 శాతం, సిరిసిల్లలో 99.6, పెద్దపల్లిలో 96.4 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. అదేసమయంలో సిజేరియన్‌లు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయి. సిరిసిల్లలో 82, జగిత్యాలలో 81, కరీంనగర్‌లో 79.9, పెద్దపల్లిలో 76.1 శాతంగా నమోదయ్యాయి. రాష్ట్రసగటు 62.2 శాతంతో పోలిస్తే నాలుగు జిల్లాల్లోనూ ఇవి చాలాఎక్కువ. ప్రభుత్వ సంస్థల్లోనూ 65–75 శాతం మధ్య ఉండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ల శాతం 86.1 నుంచి 93.6 వరకు ఉంది. కరీంనగర్‌లో ప్రైవేటు సంస్థల్లో ఏకంగా 93.6 శాతం సిజేరియన్లు నమోదయ్యాయి.
ఉమ్మడి జిల్లా సమాచారం(శాతం)
అంశం కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల
వయసుకు తగ్గ ఎత్తులేని చిన్నారులు 25.2 19.8 24.3 24.4
ఎత్తుకు తగ్గ బరువులేని చిన్నారులు 10.4 20.2 16.3 17.3
బరువు తక్కువ ఉన్న చిన్నారులు 24.0 24.7 25.6 29.0
మహిళల్లో ఊబకాయం 39.4 38.8 33.3 38.2
మహిళల్లో షుగర్ బాధితులు 19.5 18.2 17.4 19.8
మహిళల్లో బీపీ బాధితులు 22.7 24.5 22.1 23.2
ఆస్పత్రుల్లో ప్రసవాలు 100 96.4 100 99.6
సిజేరియన్ ప్రసవాలు 79.9 76.1 81.0 82.0
ప్రైవేట్‌లో సిజేరియన్లు 93.6 86.1 88.0 90.7
ఇంటర్నెట్ వినియోగిస్తున్న మహిళలు 77.7 59.2 80.7 72.4
పొగాకు ఉపయోగిస్తున్న పురుషులు 20.0 16.4 20.6 22.1
మద్యం తాగే మహిళలు 1.1 5.1 2.0 8.7
మద్యం తాగే పురుషులు 40.4 46.0 47.6 52.1


