‘జీవన సాఫల్యత’కు పురస్కారం | - | Sakshi
Sakshi News home page

‘జీవన సాఫల్యత’కు పురస్కారం

Oct 5 2026 3:56 AM | Updated on Oct 5 2026 3:56 AM

కరీంనగర్‌కల్చరల్‌: కరీంనగర్‌కు చెందిన ప్రముఖ కథా రచయిత గాజోజు నాగభూషణం రచించిన కథా సంపుటి ‘జీవన సాఫల్యత’కు ఖమ్మం కథా స్ఫూర్తి సంస్థ ఉత్తమ పురస్కారం లభించింది. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందజేశారు. సంపాదకవర్గ సభ్యులు ధరణికోట రమేశ్‌కుమార్‌, ప్రసేన్‌, సీతారాం, రవి మారుతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డా.నందిని సిధారెడ్డి, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో నాగభూషణం పురస్కారాన్ని అందుకున్నారు.

వన్యప్రాణి పరిరక్షణకు కృషి

సైదాపూర్‌: అడవులు, వన్యప్రాణి పరిరక్షణకు ప్రతీ పౌరుడు కృషి చేయాలని హుజూరాబాద్‌ ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ లత అన్నారు. ఆదివారం మండలంలోని రాయికల్‌ వాటర్‌పాల్‌ వద్ద జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించారు. అడవులను రక్షిస్తేనే వన్యప్రాణులు రక్షించబడతాయని పేర్కొన్నారు. రాయికల్‌ వాటర్‌ఫాల్స్‌ పర్యాటకంగా ప్రసిద్ధి చెందిందని, పర్యాటకుల సందడి ఎక్కువగా ఉందన్నారు. ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్‌ వ్యర్థాలు పడేయకుండా అడవుల్లో పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. భావి తరాలకు ప్రకృతిసంపదను అందించాలన్నారు. వాటర్‌ ఫాల్స్‌ వద్ద ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు. సర్పంచ్‌ చాడ అఖిలప్రకాష్‌రెడ్డి, ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మెస్‌ సమస్యలు పరిష్కరించాలి

కరీంనగర్‌సిటీ: శాతవాహన యూనివర్సిటీలో మెస్‌ బిల్లుల సమస్య పరిష్కరించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా మెస్‌లో సరిగా ఆహారం అందించడం లేదని ఆదివారం యూనివర్శిటీ గేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కొంతమంది మెస్‌ బిల్లులు చెల్లించలేదనే కారణంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఆహారం అందకపోవడంతో, కొంతమంది టీసీలు తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల అవసరాలకు సంబంధించి మౌలిక సదుపాయాల కంటే ఇతర నిర్మాణాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే మెస్‌ సమస్యను పరిష్కరించి ఆహారం అందించాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఫ్లెక్సీ వివాదం

విద్యానగర్‌(కరీంనగర్‌): ఆర్టీసీ కరీంనగర్‌ టూ డిపో ఎదుట తమ సంఘం జెండా ఆవిష్కరించకుండా అడ్డుగా టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూయూ(ఐఎన్‌టీయూసీ) సంఘాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఏఐటీయూసీ నాయకులు ఆదివారం డిపో ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కార్యదర్శి సీహెచ్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ఫ్లెక్సీల ఏర్పాటుపై ఫిర్యాదు చేసి నెల రోజులు అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఫ్లెక్సీలను తొలగించాలని లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు.

పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ లైన్‌ పనుల కారణంగా సో మవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11 కేవీ ఐబీ, సంతోష్‌నగర్‌ ఫీ డర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని టౌన్‌ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొత్తపల్లి హవేలీ సబ్‌స్టేషన్‌ పరిధిలో కొత్తపల్లి, రాణీపూర్‌, వెలిచాల, వెదిర, దేశరాజ్‌పల్లెలో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ రఘు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement