వివాదాల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి అండ! సదరు ఉద్యోగిపై అన్ని పార్టీల కార్పొరేటర్ల ఫిర్యాదు ఉద్యోగికి మద్దతుగా చక్రం తిప్పిన ఓ ‘చెత్త’ కాంట్రాక్టర్ హస్తం నేత ఆదేశాలతో అటకెక్కిన యాక్షన్ ఫైల్ కాలయాపనకు అధికారుల ‘షో’కాజు నోటీసు
కరీంనగర్‌కార్పొరేషన్: ‘కరీంనగర్ నగరపాలక సంస్థలో ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి లేని అధికారాలు చెలాయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. అతడిని సరెండర్ చేయండి’ అంటూ కాంగ్రెస్ సహా 14 మంది కార్పొరేటర్లు, ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు గత నెలలో నగరపాలకసంస్థ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అంతకుమందు జరిగిన కౌన్సిల్ సమావేశంలోనూ, పలు సందర్భాల్లోనూ బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇదే డిమాండ్‌ను వినిపించారు. ఇలా అన్ని పార్టీల కార్పొరేటర్లు ఫిర్యాదు చేయడంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని మాతృవిభాగానికి పంపిస్తారని అంతా భావించారు. కానీ, బల్దియాలో కనిపించని ఓ అదృశ్య ‘హస్తం’ ఆయనకు అండగా నిలబడడంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిపై చర్యల ఫైల్ అటకెక్కింది.
వివాదాలు.. ఆరోపణలు.. ఫిర్యాదులు
ఇతర విభాగం నుంచి నగరపాలకసంస్థకు ఔట్‌సోర్సింగ్ విధానంలో వచ్చిన ఓ ఉద్యోగి, ప్రస్తుతం బల్దియాలో అంతా తానై నడిపిస్తున్నాడు. వచ్చిన కొద్ది రోజుల్లోనే నగరపాలకసంస్థ ఉన్నతాధికారులకు సన్నిహితంగా మారిన సదరు ఉద్యోగి చెప్పిందే ప్రస్తుతం వేదంలా తయారైంది. ఎప్పుడైతే ఉన్నతాధికారుల అండదండలు దొరికాయో అప్పటి నుంచి అతడి వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. లేని అధికారాలు ఉపయోగించి, ఆధిపత్యం చెలాయించడంతో పాటు, పలు నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. గతంలో రూ.1 అంత్యక్రియల విషయంలోనూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. స్థానికంగా ఆధార్‌కార్డు లేని వ్యక్తికి రూ.1 అంత్యక్రియల పథకం వర్తించదంటూ చివరి నిమిషంలో ఆయన అడ్డు పెట్టడంపై మాజీ డిప్యూటి మేయర్, కార్పొరేటర్ భర్త గుగ్గిళ్లపు రమేశ్ మండిపడం తెలిసిందే. విచిత్రమేమిటంటే.. ఘటన జరిగిన కేవలం రెండురోజుల వ్యవధిలోనే స్థానికంగా ఆధార్‌కార్డు లేకున్నా నిరుపేదలని గుర్తిస్తే రూ.1 అంత్యక్రియలు వర్తింపచేయోచ్చని అధికారులు ప్రకటన విడుదల చేశారు. అలాగే అర్హత లేకపోయినా పబ్లిక్‌హెల్త్ వర్కర్లను ఒక్కొక్కరి వద్ద రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు తీసుకొని జవాన్‌లుగా నియమించారని, రూ.2లక్షలు తీసుకొని ట్రాక్టర్ డ్రైవర్లుగా నియమించారని, చికెన్ వ్యర్థాల సేకరణ ఏజెన్సీ నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని, బోగస్ వోచర్ బిల్లులు సృష్టించారంటూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ వైద్యుల అంజన్‌కుమార్ సహా 14 మంది కార్పొరేటర్లు, ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అంతకుముందు జరిగిన బల్దియా సర్వసభ్య సమావేశంలో బీఆర్‌ఎస్ కార్పొరేటర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్‌సింగ్, గుగ్గిళ్ల జయ శ్రీ, కాంగ్రెస్ కార్పొరేటర్ వైద్యుల అంజన్‌కుమార్ తదితరులు సదరు ఉద్యోగిని సరెండర్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అప్పుడు అధికారికంగా తీర్మానం చేయకున్నా, అందరూ సరెండర్ వైపు మొగ్గుచూపారు.
‘షో’కాజు..
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని సరెండర్ చేయాలంటూ మెజార్టీ కార్పొరేటర్ల నుంచి వస్తున్న డిమాండ్ రోజురోజుకు పెరిగిపోవడం, లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందిన నేపథ్యంలో అధికారులు ఓ కొత్త నాటకానికి తెరతీశారు. అవసరం లేకున్నా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి షోకాజు నోటీసు జారీ చేశారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే రెగ్యులర్ ఉద్యోగికి ముందుగా షోకాజు నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది కానీ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని నేరుగా మాతృసంస్థకు పంపిస్తారని, షోకాజు నోటీసు అవసరం లేదని సీనియర్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కార్పొరేటర్ల ఆగ్రహాన్ని చల్లార్చే క్రమంలో, ఏవో చర్యలు తీసుకోబోతున్నామనే సంకేతాలతో సరిపెట్టేందుకు ‘షో’కాజు నోటీసును ప్రయోగించారనే విమర్శలున్నాయి.
చక్రం తిప్పిన చెత్త కాంట్రాక్టర్?
బల్దియాలో వివాదాస్పదంగా మారిన ఔట్‌సో ర్సింగ్ ఉద్యోగిపై వేటు తథ్యమని అంతా భా విస్తున్న తరుణంలో ఎలాంటి చర్య లేకపోవడానికి ఓ చెత్త సేకరణ కాంట్రాక్టర్ కారణమనే ప్రచారం జరుగుతోంది. సదరు కాంట్రాక్టర్ సంబంధిత చెత్త కాంట్రాక్ట్ పొందడానికి, ఆ తరువాత పరిమితులు దాటి వసూళ్లకు పాల్ప డడానికి సహకరిస్తుండడంతోనే, కృతజ్ఞతగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిపై చర్యలకు అడ్డుపడ్డట్లు సమాచారం. కాంట్రాక్టర్ ఓ హస్తం నేత వద్దకు ఈ వ్యవహారం తీసుకెళ్లడం, సదరు నేత ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడంతోనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిపై చర్యలు అటకెక్కినట్లు బల్దియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా వివాదాలు, ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న సదరు ఉద్యోగిని కాపాడుతున్న ‘అదృశ్య హస్తం’ వ్యవహారం ప్రస్తుతం బల్దియాలో హాట్‌టాపిక్‌గా మారింది.


