చర్యలు చేపట్టాలి
ఆపరేషన్లు పూర్తి కావాలంటే..
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఈ కాలనీ.. ఆ కాలనీ.. అనే తేడా లేదు. ఎక్కడ చూసినా కుక్కల బెడద. గుంపుగా స్వైరవిహారం.. రాత్రుళ్లు అరుపులు.. కరవడం.. వెంటపడడం.. రోజూ తమ ప్రాంతంలో కుక్కల బెడదను అరికట్టాలంటూ నగరవ్యాప్తంగా వస్తున్న విజ్ఞప్తులు. కానీ, జంతు సంరక్షణ కేంద్రంలో సరిపడా కెనెల్స్ లేకపోవడం, భవనం చుట్టూ ప్రహరీ లేకపోవడం.. కనీసం భవనం వద్దకు వెళ్లేందుకు సరైన రోడ్డు కూడా లేని కారణంగా.. కుక్కలను నియంత్రించేందుకు చేపట్టిన ఆపరేషన్లు పదిరోజులుగా నిలిచిపోయాయి. ఓ వైపు వసతుల లేమి.. మరో వైపు కొరవడిన చిత్తశుద్ధి వెరసి నగరపాలకసంస్థ అధికారులు కుక్కల నియంత్రణలో దాదాపు చేతులెత్తేశారు.
తప్పని కుక్కల బెడద
నగరవ్యాప్తంగా కుక్కల బెడద రోజురోజుకు తీవ్రమవుతోంది. దాదాపు అన్ని డివిజన్లలోని కాలనీల్లో గుంపుగా తిరుగుతూ ఆయా కాలనీవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటికి రావడానికి జంకుతున్నారు. ఇప్పటికీ నగర వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట కుక్కల దాడిలో గాయపడుతున్న ఘటనలు దాదాపు రోజూ చోటుచేసుకుంటున్నాయి. చాలా చోట్ల కుక్కలు వాహనాల వెంట పడి పరుగెత్తుతుండడం సాధారణంగా మారింది. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మళ్లీ నిలిచిన ఆపరేషన్లు
కుక్కలను శాసీ్త్రయ పద్ధతిలో నియంత్రించేందుకు వాటికి స్టెరిలైజేషన్ చేస్తుంటారు. ఈ ఆపరేషన్‌లతో వాటి సంతానోత్పత్తి తగ్గడమే కాకుండా, ఆ కుక్కల్లో దూకుడు ఉండదు. అంటే కరవడం, దాడి చేయడం తగ్గుతాయి. రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించకుండా నిరోధించొచ్చు. గతంలో నగరంలోని పశువైద్యశాలలో ఈ ఆపరేషన్లు చేశారు. అయితే అవి నిబంధనల ప్రకారం లేవని, కుక్కలను హింసపెడుతున్నారని జంతుప్రేమికులు చేసిన ఫిర్యాదుతో ఆపరేషన్లు నిలిపివేశారు. తర్వాత బొమ్మకల్ ఆటోనగర్ దిగువ ప్రాంతంలో 38 కెనెల్స్‌తో (కుక్కలను ఉంచేవి) సొంతంగా జంతు సంరక్షణ కేంద్ర (ఏసీసీ) భవనాన్ని నిర్మించారు. కానీ ఆ భవనానికి ప్రహరీ, సరైనా రోడ్డు లేకపోవడం సమస్యగా మారింది. ప్రస్తుత వర్షాకాలం ఏసీసీకి వెళ్లే రోడ్డు పూర్తిగా బురదమయంగా మారడం, ఎగువన రోడ్డుపై లారీలు దిగబడడంతో కుక్కలను తీసుకెళ్లడానికి అంతరాయం ఏర్పడింది.
నగరంలో ఉన్న కుక్కలు: 21 వేలు
ఇప్పటివరకు ఆపరేషన్లు చేసినవి: 5,115
ఆపరేషన్లు చేయాల్సిన కుక్కల సంఖ్య: 15,885
జంతుసంరక్షణ కేంద్రంలో కెనెల్స్ సంఖ్య: 38
రోజూ ఆపరేషన్లు చేసే సామర్థ్యం: 10
ఆపరేషన్ పూర్తవాలంటే పట్టే సమయం: 5 ఏళ్లు
నగరవాసులు ఎదుర్కొంటున్న కుక్కల సమస్యను పరిష్కరించేందుకు నగరపాలకసంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. జంతు సంరక్షణ కేంద్ర భవనానికి సంబంధించి మౌలిక వసతులు కల్పించడంతో పాటు, నిబంధనలకు అనుగుణంగా ఆపరేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది.
జంతు సంరక్షణ కేంద్ర భవనం నిర్మించినా, సరిపడా కెనెల్స్ లేక కుక్కల నియంత్రణ కష్టంగా మారింది. ప్రస్తుతం 38 కెనెల్స్ మాత్రమే ఉన్నాయి. దీంతో రోజూ కేవలం పది కుక్కలకు మాత్రమే ఆపరేషన్‌లు చేసే పరిస్థితి. ఈ లెక్కన నగరంలో ప్రస్తుతం ఉన్న కుక్కలకు ఆపరేషన్లు చేయాలంటే కనీసం ఐదేళ్ల సమయం పడుతుంది. అది కూడా రోజూ క్రమం తప్పకుండా ఆపరేషన్లు చేస్తే.


