ఆందోళన వద్దు
కరీంనగర్:
జిల్లాలో ఆలస్యంగా వర్షాలు ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇంటికొకరు చొప్పున జ్వరాల బారిన పడుతున్నారు. వానాకాలమే అయినా వర్షాలకంటే ఎండలు ఎక్కువ అనే పరిస్థితి ఏర్పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. జ్వరం, ఒళ్లునొప్పులతో పాటు ఇతర వైరల్ ఫీవర్లతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దోమల స్వైర విహారంతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇంటికొకరు మంచం పడుతున్నారు. డెంగీ, వైరల్ ఫీవర్ కేసులు విజృంభిస్తున్నాయి.
వెయ్యికి చేరువైన ఓపీ
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు జ్వర పీడితుల తాకిడి పెరిగింది. వారం రోజులుగా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఓపీ 1,000 మార్కును దాటుతోంది. సోమవారం 1,177 ఓపీ నమోదవడంతో ఆందోళన నెలకొంది. ఇందులో విష జ్వరాల కారణంగా ఓపీ సేవల కోసం వచ్చిన వారే ఎక్కువ. ఏటా వర్షాకాలంలో దోమల వ్యాప్తితో విషజ్వరాల కేసులు నమోదవుతుంటాయి. దీంతో ఇన్‌పేషెంట్ (ఐపీ) సంఖ్య కూడా పెరుగుతోంది. వారం రోజుల్లో 500 దాటింది. కొంత మంది రెండుమూడు రోజులకే జ్వరం తగ్గి డిశ్చార్జ్ అయి వెళ్లి పోతుంటే, జ్వర ప్రభావం ఎక్కువగా ఉన్నవారు నాలుగైదు రోజులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో డెంగీ జ్వరాలతో ఎవరూ ఆసుపత్రిలో చేరలేదని అధికారులు వెల్లడించారు.
ప్రైవేటులో దోపిడీ
జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో విషజ్వరాల పేరుతో రోగులను దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ జ్వరం వచ్చినా ప్లేట్‌లెట్స్ తగ్గడం సర్వసాధారణం. అయితే ప్లేట్‌లెట్స్ తగ్గుతున్నాయని, డెంగీ వచ్చిందంటూ భయపెట్టి రోజుల తరబడి ఆస్పత్రిలోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. రోజూ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండే నీటి నిల్వలను తొలగించాలి. మురుగు కాలువల్లో వ్యర్థాలు వేయకుండా చూడాలి.
సాయంత్రం 6 గంటల సమయంలో దోమలు ఇళ్లల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో తలుపులు మూసివేయాలి. కిటికీలకు జాలీలు ఏర్పాటు చేయాలి.
వానాకాలంలో నీటి కాలుష్యంతో డయేరియా, టైఫాయిడ్, కామెర్లు సోకే అవకాశం ఉన్నందున కాచి చల్లార్చిన నీటిని తాగాలి. భోజనానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం ద్వారా అతిసారం, ఇతర సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చు. వానాకాలం మాంసాహారం జోలికి వెళ్లకూడదు. ఈగలు మాంసంపై చేరడం వల్ల వ్యాధుల బారినపడతారు.
సీజనల్ వ్యాధులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. రోజురోజుకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ, ఐపీ సంఖ్య పెరుగుతోంది. సీజనల్, వైరల్ జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు డెంగీ కేసులు రాలేదు. డెంగీ కేసులు వచ్చినా చికిత్స అందిస్తాం. రెండో ఫ్లోర్‌లో జ్వరాల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశాం. ఎన్ని కేసులు వచ్చినా వైద్యులు, సిబ్బంది, మందులకు ఎలాంటి ఇబ్బంది లేదు.
– డాక్టర్ వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్


