పైసల పంచాయతీ! | - | Sakshi
Sakshi News home page

పైసల పంచాయతీ!

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

పైసల పంచాయతీ! ● గ్రామాభివృద్ధికి ఇటుకబట్టీ యజమానుల విరాళం ● వాటాలుగా పంచుకున్న పాలకవర్గం

కరీంనగర్‌రూరల్‌: గ్రామాభివృద్ధికి ఇటుకబట్టీల యజమానులు ఇచ్చిన డబ్బుల పంపకంలో ఏర్పడిన విభేదాలతో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు రెండువర్గాలుగా విడిపోయారు. గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాల్సిన డబ్బును సర్పంచు, వార్డుసభ్యులు వాటాలుగా పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. వివరాలు.. కరీంనగర్‌ మండలంలోని ఓ గ్రామపంచాయతీ పరిధిలో కొత్తగా ఇటుక బట్టీలు ప్రారంభించేందుకు ఇద్దరు యజమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. పంచాయతీ అనుమతికోసం దరఖాస్తు చేసుకుని గ్రామాభివృద్ధికి రూ.5 లక్షలు చెల్లించారు. అయితే పాలకవర్గ సభ్యులు ఆ డబ్బులను పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా ఆదివారం వాటాలుగా పంచుకునేందుకు సమావేశమయ్యారు. వార్డుసభ్యుల కంటే ఉపసర్పంచుకు ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చేందుకు కొందరు సభ్యులు అంగీకరించకపోవడంతో ఇరువర్గాల నడుమ వివాదమేర్పడింది. పలుమార్లు చర్చల అనంతరం చివరకు వార్డుసభ్యులకు రూ.25వేలు, ఉపసర్పంచుకు రూ.50వేల చొప్పున పంపిణీ చేయగా మిగతా రూ. 1.75 లక్షలు సర్పంచు వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. పాలకవర్గ సభ్యులు వ్యవహరించిన తీరుతో మనస్తాపానికి గురైన పంచాయతీ కార్యదర్శి దీర్ఘకాలిక సెలవులో వెళ్లడం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించి, చట్టప్రకారం చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement