కరీంనగర్‌క్రైం: నేరాల స్వరూపం రోజురోజుకు మారుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ కూడా అదే స్థాయిలో సాంకేతికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సీపీ గౌస్ ఆలం అన్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, స్మార్ట్ సర్వైలెన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించేలా కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ)లో ప్రారంభించి మాట్లాడారు. కృత్రిమ మేధస్సు ఆధారిత పోలీసింగ్ ద్వారా నేరాల నియంత్రణ, దర్యాప్తు వేగవంతం కావడంతో పాటు ప్రజలకు మరింత పారదర్శక, సమర్థవంతమైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది సాంకేతికంగా మరింత నైపుణ్యం సాధించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ పోలీసు శాఖను సాంకేతికంగా మరింత బలోపేతం చేసేదిశగా ఈ కార్యక్రమం నిలుస్తుందన్నారు. కాగా, కరీంనగర్ పీటీసీ కేంద్రంగా నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట కమిషనరేట్లు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బందికి 11 దశల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి దశలో 80 మంది చొప్పున మొత్తం 880 మంది కానిస్టేబుళ్లకు ఐదు రోజులపాటు శిక్షణ అందించనున్నారు. కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపాల్ ఏఎస్పీ ఎం.పిచ్చయ్య, వైస్ ప్రిన్సిపాల్, ఏసీపీ గంగాధర్, ఏసీపీలు విజయపాల్‌రెడ్డి, బి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.


