తుపాకీతో బెదిరించి.. దుప్పటితో బంధించి | - | Sakshi
Sakshi News home page

తుపాకీతో బెదిరించి.. దుప్పటితో బంధించి

Jul 23 2026 1:42 AM | Updated on Jul 23 2026 1:42 AM

నగరంలో అర్ధరాత్రి భారీ చోరీ

డమ్మీ తుపాకులు, కత్తులతో కుటుంబాన్ని బెదిరించి

54 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.25 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు అపహరణ

నిందితులు వరంగల్‌వైపు పారిపోయినట్లు అనుమానం

ఎనిమిది పోలీసు బృందాలతో ముమ్మరంగా గాలింపు

కరీంనగర్‌క్రైం: నిషిరాత్రిలో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పీఎంజే జువెల్లరీస్‌ దోపిడీ ఘటన నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మంగళవారం అర్ధరాత్రి మరో భారీచోరీ జరిగింది. భగత్‌నగర్‌లోని ఓ ఇంట్లో చొరబడిన దుండగులు ఇంట్లోవారిని డమ్మీ తుపాకీతో బెదిరించి, ఆపై బంధించి పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డారు. వన్‌టౌన్‌ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని భగత్‌నగర్‌లో అజ్మత్‌అలీ భార్య మహముదా బేగం, ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి సుమారు 12 గంటలకు ఇంటి ఆవరణలో లైట్లు ఆఫ్‌ చేసేందుకు బయటకొచ్చాడు. అప్పటికే కారిడార్‌లో మాటువేసి ఉన్న 6 నుంచి 8మంది గుర్తు తెలియని దుండగులు అలీపై దాడి చేశారు. డమ్మీ తుపాకులు, కత్తులతో బెదిరించారు. హాల్‌లోకి ఈడ్చుకెళ్లి బెడ్‌షీట్లతో బంధించారు. నోటికి గుడ్డ కట్టి టీవీ శబ్దాన్ని పెంచారు. బెడ్‌రూమ్‌లో ఉన్న మహముదా బేగం, ఇద్దరు కుమార్తెలనూ అదే విధంగా బంధించారు. అల్మారా తెరిచి రూ.25 లక్షల నగదు, 54 తులాల బంగారం, 30 తులాల వెండి, రెండు ఖరీదైన సెల్‌ఫోన్లు అపహరించారు. ఇంట్లో అద్దెకుంటున్న వినోద్‌, మహ్మద్‌ గౌసోద్దీన్‌లకు చెందిన రెండు బైక్‌లను తీసుకుని పరారయ్యారు. మెల్లిగా తేరుకున్న బాధితులు బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం చోరీ జరిగిన ఇంట్లో దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌, ఫోరెన్సిక్‌ నిపుణులు వేలిముద్రలు, పాదముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దుండగులు వదిలివెళ్లిన డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు యూపీ– ఢిల్లీ ప్రాంతానికి చెందినట్లుగా, హిందీలో మాట్లాడినట్లు బాధితులు పోలీసులకు వివరించారు.

తెలిసినవారి హస్తం ఉందా?

ఇంట్లో ఉన్న నగదు, బంగారాన్ని నిందితులు నేరుగా వెళ్లి చోరీచేసిన తీరు, కుటుంబ సభ్యుల కదలికలపై వారికున్న స్పష్టమైన అవగాహనను బట్టి బాధితులకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి సమాచారం ఇచ్చి ఉండొచ్చనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

పరిశీలించిన సీపీ గౌస్‌ ఆలం

ఘటనాస్థలాన్ని సీపీ గౌస్‌ ఆలం, అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ వెంకటస్వామి పరిశీలించారు. దోపిడీ జరిగిన తీరుపై ఆరా తీశారు. నిందితులను పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దుండగులు నగరంలోకి ఏ మార్గంలో వచ్చారు..? దోపిడీ అనంతరం ఏ దిశగా వెళ్లారు, దొంగిలించిన బైక్‌లను ఎక్కడ వదిలివేశారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం దర్యాప్తునకు ప్రతిబంధకంగా మారింది. సమీపంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, టోల్‌ప్లాజాలు, పెట్రోల్‌ బంకుల వద్ద

ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

వరంగల్‌ వైపుగా పారిపోయిన నిందితులు

నిందితులు దొంగతనం అనంతరం వరంగల్‌ వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నా రు. రెండు వాహనాలపై ఐదుగురు వెళ్లి సిరిసిల్ల బై పాస్‌ రోడ్డులో ఉన్న బంక్‌లో పెట్రోల్‌ పోయించుకున్నట్లు గుర్తించారు. వరంగల్‌ రూట్లో పెద్దపాపయ్యపల్లి వరకు వెళ్లి అక్కడ నుంచి గ్రామీణరోడ్ల గుండా ప్రయాణించినట్లు అనుమానిస్తున్నారు. మొత్తం 8 మంది వచ్చి ఉంటే, ఐదుగురు మాత్రమే రెండు బై కులపై వరంగల్‌ వైపునకు వెళ్తే.. మిగితా ముగ్గురు ఎటువైపు వెళ్లారనేదానిపై విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement