● ఆగిఉన్న లారీని ఢీకొట్టిన డీసీఎం
● ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు దుర్మరణం
● వారిద్దరూ మంచిస్నేహితులు
జ్యోతినగర్: నిశీథిలో మృత్యువు కాపుకాసింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని బలి తీసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం తెల్లవారు జామున జరిగింది. ఆగిఉన్న లారీని డీసీఎం వ్యాను వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన చెందిన ఇద్దరు స్నేహితులు(డ్రైవర్, క్లీనర్) దుర్మరణం చెందారు. వాహనాల్లో ఇరుక్కున్న వారిని రక్షించేందుకు గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌కిరణ్, పోలీసులు నాలుగు గంటల పాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గోదావరిఖని వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ టైర్ ఎన్టీపీసీ క్రషర్‌నగర్ వద్ద బుధవారం వేకువజామున పంక్చర్ అయ్యింది. అప్పటికే వర్షం కురుస్తోంది. డ్రైవర్ పుష్పేంద్ర గోండ్, క్లీనర్ అనురాగ్ సింగ్ మరమ్మతులు చేస్తుండగా, అదే సమయంలో ఛత్తీస్‌ఢ్ నుంచి బఠాణీల లోడుతో డీసీఎం వ్యాన్ హైదరాబాద్ వైపు వెళ్తోంది. చీకటిగా ఉండడం, వర్షం కురుస్తుండడంతో ఆగిఉన్న లారీని గమనించక వెనకాలే వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఘటనలో వ్యాన్‌లోని డ్రైవర్ మనోహర్(26), క్లీనర్ సూర్యవంశీ(23) క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. భారీశబ్దం రావడంతో అప్రమత్తమైన స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు. సీఐలు ఇంద్రసేనారెడ్డి, కృష్ణకుమార్ ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. నాలుగు గంటల పాటు శ్రమించినా వాహనంలో ఇరుక్కున్నవారిని కాపాడలేకపోయారు. రెండు క్రేన్ల సాయంతో బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మనోహర్, సూర్యవంశీ స్నేహితులు. మనోహర్ తండ్రి నకుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ కృష్ణకుమార్ తెలిపారు. వర్షంలోనూ సీఐలు, ఎస్సైతోపాటు హెడ్ కానిస్టేబుళ్లు పురుషోత్తం, కృష్ణారెడ్డి, కానిస్టేబుళ్లు అంజి, వినయ్, హోంగార్డు మనోహర్, హెచ్‌కేఆర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టడాన్ని స్థానికులు అభినందించారు.


