ఆరు దుకాణాల్లో దొంగతనం | - | Sakshi
Sakshi News home page

ఆరు దుకాణాల్లో దొంగతనం

Jul 23 2026 1:42 AM | Updated on Jul 23 2026 1:42 AM

● వేములవాడలో దొంగల బీభత్సం

వేములవాడ: పట్టణంలోని జాతరగ్రౌండ్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆషాఢ మాసం నేపథ్యంలో మూసివేసి ఉన్న డేరా షాపులను లక్ష్యంగా చేసుకున్నారు. ఒకే రాత్రిలో ఆరు షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. షాపుల తాళాలు పగులగొట్టి లోపల ఉన్న నగదు, విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం షాపులు తెరిచేందుకు వచ్చిన వ్యాపారులు చోరీ జరిగిన విషయం గుర్తించి షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

బస్సును తీసుకెళ్లిన నిందితుడి అరెస్ట్‌

కోరుట్ల: పట్టణంలోని బస్టాండ్‌ నుంచి ఓ బస్సును మంగళవారం తీసుకెళ్లిన ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన నిందితుడు కందుల సాంబయ్యను అరెస్టు చేసినట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. బస్సును తీసుకెళ్లడంతోపాటు నిర్లక్ష్యంగా నడిపి పలువురికి ఢీకొట్టి గాయపరిచినందుకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పేర్కొన్నారు.

పాముకాటుతో గీతకార్మికుడి మృతి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో బుధవారం గీత కార్మికుడు గుగ్గిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌(46) పాముకాటుతో మృతిచెందాడు. మంగళవారం రాత్రి పాము కాటు వేయగా.. బుధవారం ఉదయం శ్రీనివాస్‌ నోటి నుంచి నురుగలు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

కుప్పకూలిన రైస్‌మిల్లు

● రూ.3కోట్లకుపైగా ఆస్తినష్టం

పెద్దపల్లి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ముసరువానకు కురిసింది. సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలోని సాయి సరస్వతి బాయిల్డ్‌ రైస్‌మిల్లు గోడలు కుప్పకూలినట్లు కార్మికులు తెలిపారు. గోదాములో నిల్వచేసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. సుమారు రూ.3కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు యజమాని శ్రీకాంత్‌ అధికారులకు విన్నవించారు. సమాచారం అందుకున్న రైస్‌మిల్లు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు విజయ్‌పాల్‌రెడ్డి, చీటి సతీశ్‌రావు కేశవరావు తదితర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement