రామ లక్ష్మణ జానకీ.. జైబోలో హనుమాన్‌కీ | - | Sakshi
Sakshi News home page

రామ లక్ష్మణ జానకీ.. జైబోలో హనుమాన్‌కీ

May 13 2026 2:14 AM | Updated on May 13 2026 2:14 AM

న్యూస్‌రీల్‌

భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు అంజన్న ఆలయం

జయంతి

సందర్భంగా విశేష అలంకరణలో కొండ గట్టు అంజన్న స్వామి

నగరంలోని టవర్‌లో ఏక్తాయాత్ర

హిందూ ఏక్తాయాత్రతో కాషాయమయమైన కరీంనగర్‌ సిటీ

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి పెద్ద జయంతి సందర్భంగా ఆలయం కిక్కిరిసిపోయింది. మంగళవారం వేకువజామున మూడు గంటలకు స్వామివారికి తిరుమంజనం నిర్వహించారు. విశేష అభిషేకం, అర్చనలు చేసి పట్టువస్త్రాలతో అలంకరించారు. హోమం, మహాపూర్ణాహుతి, ఊయల సేవ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల జై హనుమాన్‌.. జై శ్రీరాం నామస్మరణలతో పరిసరాలు మార్మోగాయి. ఇరుముడులతో పాదయాత్ర వేలాదిమంది స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. ఉత్సవాలను కలెక్టర్‌ బి.సత్య ప్రసాద్‌, ఎస్పీ అశోక్‌కుమార్‌ పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పర్యవేక్షించారు. అదనపు కలెక్టర్‌ బి.రాజాగౌడ్‌, ఆర్డీవో మధుసూదన్‌, ఆలయ ఈవో అంజనారెడ్డి వారి వెంట ఉన్నారు. లక్షలాది మంది భక్తుల రాకతో స్వామివారి కోనేరు కాషాయమయమైంది. మాల విరమణ చేసిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పొన్నం సత్తయ్య గౌడ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. స్వామివారిని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ దర్శించుకున్నారు.

కరీంనగర్‌: కరీంనగర్‌ నగరం కాషాయమయమైంది. ‘రామలక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్‌ కి’ నినాదాలతో మార్మోగింది. హనుమాన్‌ జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ నేతృత్వంలో నిర్వహించిన హిందూ ఏక్తాయాత్ర వైశ్య భవన్‌ నుంచి ప్రారంభమై టవర్‌, కమాన్‌, వన్‌టౌన్‌, అమరవీరుల స్తూపం మీదుగా తిరిగి వైశ్య భవన్‌ వరకు వైభవంగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా హనుమాన్‌ భక్తులు, ప్రజలు తరలివచ్చారు. యాత్రలో శ్రీరాముడు, ఆంజనేయస్వామి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యారణ్య భారతీస్వామీజీ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ఇలాంటి యాత్రలు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. యాత్రకు 400 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement