మండలాల వారీగా ఈకేవైసీ నమోదు వివరాలు
కరీంనగర్‌రూరల్: ఉపాధిహామీ పథకం కూలీలకు ఈకేవైసీ నమోదు గుబులు పట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీకి విధించిన గడువు ఈ నెల 10తో ముగిసింది. జిల్లాలో పూర్తిస్థాయిలో కూలీల ఈకేవైసీ నమోదు పూర్తికాకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధిహామీ పథకంలో అక్రమాలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కూలీలకు ఈకేవైసీ తప్పనిసరిగా చేయాలని గతేడాది ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసింది. పని ప్రదేశాల్లో కూలీల నమోదు, వేతనాల చెల్లింపులకు ఈకేవైసీని ప్రామాణికంగా పరిగణిస్తామని ప్రకటించడంతో జిల్లావ్యాప్తంగా నమోదు ప్రక్రియను చేపట్టారు.
ముగిసిన గడువుతో ఆందోళన
జిల్లాలో ఉపాధి కూలీలు 1,07,667 మంది ఉండగా 1,03,877 మంది ఈకేవైసీ పూర్తయింది. ఇంకా 3,790 మంది నమోదు పూర్తి చేయాల్సి ఉంది. రామడుగు, తిమ్మాపూర్ మండలాలు 98శాతం నమోదుతో మొదటిస్ధానంలో ఉన్నాయి. కూలీ ఆధార్‌కార్డు వివరాలతోపాటు ఫొటో, ఐరిస్‌లను సెల్‌ఫోన్‌లో నమోదు చేస్తే ఈకేవైసీ పూర్తవుతుంది. గతేడాది ఏప్రిల్ నెల నుంచి చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ 96శాతం పూర్తికాగా వందశాతం నమోదు పూర్తికాకపోవడం గమనార్హం. ఈకేవైసీ నమోదుకు కొంతమంది కూలీలు అందుబాటులో లేకపోవడం, ఆధార్‌కార్డులోని వివరాలు, ఫొటో మ్యాచింగ్ కాకపోవడం, ఐరిస్‌లో మార్పులు తదితర కారణాలతో వందశాతం నమోదు కాలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం విధించిన గడువు ఈ నెల 10తో పూర్తయిందని, నమోదు ప్రక్రియ గడువు పొడిగిస్తారా లేదా అనే సమాచారం ఇంకా రాలేదని తెలిపారు.
మండలం కూలీలు ఈకేవైసీ మిగిలినవారు
జమ్మికుంట 7,578 7,228 350
కరీంనగర్‌రూరల్ 3,872 3,697 175
ఇల్లంతకుంట 7,596 7,262 334
మానకొండూరు 10,097 9,669 428
గన్నేరువరం 5,359 5,145 214
చొప్పదండి 5,883 5,652 231
సైదాపూర్ 9,142 8,819 323
వీణవంక 10,757 10,380 377
హుజూరాబాద్ 7,004 6,774 230
శంకరపట్నం 9,587 9,287 300
కొత్తపల్లి 2,317 2,247 70
చిగురుమామిడి 6,803 6,603 200
గంగాధర 8,553 8,316 237
రామడుగు 6,856 6,685 171
తిమ్మాపూర్ 6,263 6,113 150


