సెన్సెస్‌ షురూ..! | - | Sakshi
Sakshi News home page

సెన్సెస్‌ షురూ..!

May 13 2026 2:14 AM | Updated on May 13 2026 2:14 AM

● నగరంలో కొనసాగుతున్న హౌస్‌ నంబరింగ్‌ ● 14 నుంచి ఇంటింటి జనగణన

నగరపాలకసంస్థలో జనగణన ప్రణాళిక

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ పరిధిలో జనగణన 2027 ప్రారంభమైంది. ఇప్పటివరకు స్వీయ గణనకు అవకాశం కల్పించిన ప్రభుత్వం, 11వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో గణన మొదలు పెట్టడం తెలిసిందే. నగరంలో బ్లాక్‌లవారీగా ముందుగా కుటుంబాల సంఖ్య ఆధారంగా ఇళ్లకు నంబరింగ్‌ (సెన్సెస్‌ హౌస్‌ నంబరింగ్‌) చేస్తున్నారు. 14వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి తిరిగి కుటుంబాలవారీగా జనగణన చేపట్టనున్నారు.

666 బ్లాక్‌లు

2027 జనగణన తొలిదశను విజయవంతంగా పూర్తి చేసేందుకు నగరపాలకసంస్థ అధికారులు బ్లాక్‌ల వారీగా గణనను విభజించారు. నగరపాలకసంస్థలో 66 డివిజన్లు ఉండగా, 666 బ్లాక్‌లుగా విభజించారు. 180 నుంచి 200 ఇళ్లకు ఒక బ్లాక్‌గా పరిగణిస్తారు. ప్రతి బ్లాక్‌కు ఒక ఎన్యుమరేటర్‌ చొప్పున 666 బ్లాక్‌లకు 666 మంది ఎన్యుమరేటర్లను, పర్యవేక్షించేందుకు 111 మంది సూపర్‌వైజర్లను నియమించారు.

14 నుంచి ‘ఇంటి లెక్కలు’

జనగణన మొదటి దశ ప్రారంభం కావడంతో ఎన్యుమరేటర్లు కుటుంబాలవారీగా ఇళ్లకు నంబరింగ్‌ వేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఆ ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయనే లెక్కల ఆధారంగా ఆ ఇంటి గోడ లేదంటే తలుపులకు చాక్‌పీస్‌లు, స్టిక్కర్లతో నంబర్‌ వేస్తున్నారు. బుధవారం వరకు హౌస్‌నంబరింగ్‌ను పూర్తి చేయనున్నారు. 14వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి కుటుంబాల వారీగా జనగణనను చేపడుతారు. ప్రభుత్వం రూపొందించిన 33 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టనున్నారు. ఇప్పటికే స్వీయ గణనను నమోదు చేసుకుంటే, ఆ ఐడీ ఆధారంగా జనగణన ఎన్యుమరేటర్‌ పూర్తి చేయనున్నారు.

ప్రజలు సహకరించాలి : ప్రఫుల్‌దేశాయ్‌

జన గణనలో భాగంగా ప్రజలు తమ వివరాలు అందించి ఎన్యుమరేటర్లకు సహకరించాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ కోరారు. నగరంలో జనగణన ప్రక్రియలో భాగంగా సెన్సెస్‌ హౌసెస్‌ నంబరింగ్‌ సాగుతున్న తరుణంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 2027 జనాభా లెక్కలకు నగర ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని అన్నారు. సర్వే సమయంలో ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లు, సూపర్‌ వైజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలన్నారు.

డివిజన్లు 66

బ్లాక్‌లు 666

(180 నుంచి 200 ఇండ్లకు ఒక బ్లాక్‌)

ఎన్యుమరేటర్లు 666

సూపర్‌వైజర్లు 111

Advertisement
 
Advertisement
Advertisement