తండ్రి దినకర్మ రోజే తనయుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

తండ్రి దినకర్మ రోజే తనయుడి ఆత్మహత్య

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

తండ్రి దినకర్మ రోజే తనయుడి ఆత్మహత్య జీవితంపై విరక్తితో వ్యక్తి..

దుమాలలో విషాదం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఓ ఆటో డ్రైవర్‌ తండ్రి దినకర్మ రోజు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో మంగళవారం విషాదం నింపింది. ఐదు రోజుల వ్యవధిలో తండ్రీకొడుకులు మృతిచెందడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు. దుమాలకు చెందిన పాముల భాస్కర్‌గౌడ్‌(43) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐదురోజుల క్రితం తన తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. తండ్రి దినకర్మ సోమవారం జరిపించారు. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్థలు తలెత్తడంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కర్‌గౌడ్‌కు భార్య పద్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్‌ శరవిందు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గుల్లపల్లి నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

ఉరేసుకుని మహిళ..

జగిత్యాలక్రైం: జగిత్యాలలోని హనుమాన్‌వాడకు చెందిన సాయిని అంజవ్వ (51) మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంజవ్వకు సారంగాపూర్‌ మండలం రేచపల్లిలో కొంత భూమి ఉంది. వారి సమీప బంధువులతో వివాదం కొనసాగుతోంది. భూమి పోతుందని మనస్తాపానికి గురైన అంజవ్వ ఇంట్లోనే ఉరేసుకుంది. అంజవ్వ కూతురు సాయిని సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఏఎస్సై అజిజోద్దీన్‌ తెలిపారు.

మానకొండూర్‌: మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు సీతాల రమేశ్‌ (38) జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ శ్రీలత తెలిపిన వివరాలు.. రమేశ్‌కు ఆరేళ్ల క్రితం వివాహమైంది, భార్యతో విడాకుల కేసు కొనసాగుతోంది. తల్లిదండ్రులు గతంలోనే చనిపోవడంతో రమేశ్‌ ఒంటరిగా జీవిస్తున్నాడు. దీంతో మనస్థాపానికి గురై సోమవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.

ప్రజావాణిలో ఫిర్యాదు..

చెప్పుతో కొడతానన్న మహిళా సర్పంచ్‌

సోషల్‌ మీడియాలో ఆడియో వైరల్‌

శంకరపట్నం: కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గ్రామంలో చెట్ల నరికివేతపై ఓ వ్యక్తి ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. గతంలోనూ మరో వ్యక్తి గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రజావాణిని ఆశ్రయించాడు. దీంతో విచారణ నిమిత్తం అధికారులు తరచూ గ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో ‘కావాలనే కొందరు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారని, వారిని చెప్పుతో కొడతా’ అంటూ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై వార్డు సభ్యులు సమావేశం అయ్యారు. శ్రీఎవరిని చెప్పుతో కొడతారంటూ’ సర్పంచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement