కరీంనగర్ టౌన్: దళిత క్రెస్తవులకు కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసిందని ఎమ్మార్పీస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రిస్టియన్ పాస్టర్స్ ఫెలోషిప్ సంస్థ కరీంనగర్‌లోని ఇందిరా భవన్‌లో ‘దళిత క్రైస్తవులు .. రాజ్యాంగ హక్కులు, సామాజిక హోదా’ అంశంపై మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలోకి ఇస్లాం ప్రవేశించకముందు ఉన్న కులవిక్షను క్రైస్తవం ఇప్పటికీ అనుభవిస్తోందన్నారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు దళితుల మెడపై కత్తిలాగా వేలాడుతున్నాయని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25కు ఇవి పూర్తి వ్యతిరేకమైనవని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిక్కు, బౌద్ధ దళితులకు ఎస్సీ హోదా ఇచ్చినట్లుగా దళిత క్రైస్తవులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1947 నుంచి 1977 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దళిత క్రైస్తవులకు న్యాయం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నా ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయకుండా అన్యాయం చేసిందని విమర్శించారు. తాను ఏ పార్టీ వాడిని కాదని, తన ఒంటిపై కండువా ఎప్పటికీ మారదని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని తీర్పు చెబితే అన్నిరాజకీయ పార్టీలు మౌనం వహించాయని విమర్శించారు. న్యాయం, ధర్మం దళిత క్రైస్తవుల పక్షాన ఉందని, శక్తిమంతమైన ఉద్యమాన్ని నడిపి ప్రజా మద్దతు సమీకరిద్దామని ఆయన కోరారు. పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జాఘవా అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎలీషా, గంగరాజు, బెన్ని, మోజెశ్‌బాబురావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ


