పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో పోలీసులకు సవాల్‌గా నిందితులు
దోచుకున్న బంగారాన్ని వాటాలుగా పంచుకుని విడిపోయినట్లు అనుమానం
ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఏమరుస్తున్న ముఠా
వెస్ట్‌బెంగాల్ నుంచి మహారాష్ట్ర వరకు విస్తరించిన గాలింపు
పోలీసులకు చిక్కిన పలువురు నిందితులు..?
రాష్ట్రాలను జల్లెడ
కరీంనగర్‌క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో నిందితుల వేట పోలీసులకు ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టపగలు కాల్పులు జరిపి రూ.కోట్ల విలువైన బంగారం దోచుకెళ్లిన ఆరుగురు నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దొంగతనం జరిగిన రోజు నుంచి కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి పలు రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నా.. నిందితులు అడుగడుగునా ఏమరుస్తున్నట్లు తెలుస్తోంది.
టవర్ లొకేషన్లతో నిందితుల జాడ
దర్యాప్తులో కీలకంగా మారిన మొబైల్ టవర్ లొకేషన్ల ఆధారంగా పోలీసులు ఇప్పటివరకు పశ్చిమబెంగాల్, బిహర్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టినట్లు సమాచారం. నింది తులు తరచూ సిమ్ కార్డులు మార్చడం.. ఫోన్లు స్వి చ్ఛాఫ్ చేయడం, అవసరమైన సమయంలో మాత్ర మే ఫోన్లు ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేస్తుండటంతో వారి కచ్చితమైన లొకేషన్‌ను ట్రాక్ చేయడం పోలీసులకు సవాల్‌గా మారినట్లు తెలుస్తుంది. ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు ఉండకుండా గంటల వ్యవధిలో ప్రాంతాలు మారుస్తూ పోలీసు బృందాలను అయోమయానికి గురిచేస్తున్నట్లు తెలిసింది.
బంగారాన్ని పంచుకుని విడిపోయారా..?
దోపిడీ అనంతరం ముఠా సభ్యులు కలిసి ప్రయాణించకుండా ప్రణాళిక ప్రకారం విడిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దోచుకున్న బంగారాన్ని వాటాలుగా పంచుకుని వివిధ రాష్ట్రాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రాష్ట్రంలో బంగారాన్ని విక్రయించే ప్రయత్నం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా ధృవీకరించడంలేదు. అతడి నుంచి కీలక సమాచారం లభించినట్లు.. మరో ఇద్దరు నిందితుల జాడ కూడా పోలీసులు కనిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
కాల్స్‌తోనే క్లూస్..
నిందితులు ఫోన్లు పూర్తిగా వాడకపోయినా కుటుంబసభ్యులు, పరిచయస్తులతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ ఆధారంగానే టెక్నికల్ టీమ్‌లు వారి కదలికలను విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్లు, లాడ్జీలు, బంగారం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. అనుమానాస్పదంగా బంగారం విక్రయించే వ్యక్తుల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపినట్లు తెలిసింది.
ప్రత్యేక బృందాల ముమ్మర వేట
కేసు ఛేదన కోసం కరీంనగర్ కమిషనరేట్ గోప్యంగా పలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. బృందాలకు రాష్ట్రాలవారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు, వివిధ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల సహకారంతో నిందితుల పాత నేరచరిత్ర, ముఠా లింకులు, ప్రయాణ మార్గాలపై లోతుగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆరుగురిలో పలువురు నిందితుల జాడ పోలీసులు కనిపెట్టగా.. మిగితా వారి కోసం వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిసింది. నిందితులు ఎంతదూరం పారిపోయినా.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


