సమ్మర్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

కొత్తపల్లి(కరీంనగర్‌): విద్యార్థులు సమ్మర్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు –2026 ఫౌండేషన్‌ డే కార్యక్రమాన్ని సోమవారం పీఎం శ్రీ కొత్తపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి చెస్‌, క్యారమ్‌ ఆటలాడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఎంఈఓ తుమ్మ ఆనందం, ఈఈ అశోక్‌కుమార్‌, కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, ఏఏపీసీ చైర్‌పర్సన్‌ సుగుణ, హెచ్‌ఎం కన్నం రమేశ్‌, ఐఈఆర్‌పీ దీప్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొత్తపల్లి మండలం ఎలగందుల మోడల్‌ స్కూల్‌లో సమ్మర్‌ క్యాంపును ఎంఈవో ప్రారంభించారు.

హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయండి

కరీంనగర్‌: హనుమాన్‌ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో క రీంనగర్‌లోని వైశ్యభవన్‌ నుంచి నిర్వహించే ‘హిందూ ఏక్తాయాత్ర’ను విజయవంతం చే యాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. సోమవారం ఏక్తాయాత్ర ఏర్పాట్లను కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలతో కలిసి పరిశీలించి మాట్లాడారు. హిందువుల సంఘటిత శక్తిని చాటేందుకు 12 ఏళ్లుగా లక్షలాది మందితో జరిగే యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చిందన్నారు. హిందూ సమాజం తరలిరావాలని కోరారు.

భగీరథ్‌పై చర్యలు తీసుకోండి

విద్యానగర్‌(కరీంనగర్‌): కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌ లైంగిక దాడి చేసినట్లు మైనర్‌ బాలిక ఫిర్యాదు చేసినా అతడిపై చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం వివిధ సంఘాలు, పార్టీలు నగరంలో నిరసన తెలిపాయి. భగీరత్‌ను పోక్సో కేసులో అరెస్ట్‌ చేయాలని తెలంగాణ చౌక్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. గ్రంథాలయ మాజీ చైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, మచ్చ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్‌, నాయకులు పాల్గొన్నారు. రాజకీయ అక్రమ సంబంధం వల్లే భగీరత్‌ను అరెస్ట్‌ చేయడం లేదని బీఎస్పీ జోన్‌ ఇన్‌చార్జి నిషాని రామచంద్రం ఆరోపించారు. నిందితుడు కేంద్ర మంత్రి కొడుకు అయినందుకే పోలీసులు అరెస్ట్‌ చేయడం లేదన్నారు. మాతంగి అశోక్‌, పల్లె ప్రశాంత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తులు ఆహ్వానం

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): హైదరాబాద్‌లోని బేగంపేట, రామాంతాపూర్‌ పబ్లిక్‌ స్కూల్స్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి 1వ తరగతి (ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశానికి అర్హులైన ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి తెలిపారు. జిల్లాకు కేటాయించిన 6 సీట్లలో ఎరుకల వారికి 3, లంబాడ వారికి 2, ఇతరులకు 1 సీటు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 1 జూన్‌ 2019 నుంచి 31 మే 2020 మధ్య జన్మించి ఉండాలని, తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలకు మించరాదని సూచించారు. ఆసక్తి గల వారు ఈనెల 12 నుంచి 18 వరకు కలెక్టరేట్‌లోని గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు పొందవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఉండదని, దరఖాస్తులు ఎక్కువగా వస్తే ఈనెల 22న లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఎంపికై న విద్యార్థులకు హాస్టల్‌ వసతి ఉండదని, మరిన్ని వివరాలకు 95026 64044 నంబరులో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement