● రైళ్లలో ఆకస్మిక సోదాలతో ప్రయాణికుల బెంబేలు ● లక్నో, గోరఖ్‌పూర్ రైళ్లపైనే ప్రత్యేక నిఘా
రామగుండం: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఇటీవల ఓ మాజీ డీజీ సతీమణిని ఇంట్లోనే మట్టుబెట్టిన నేపాలీ గ్యాంగ్‌పైనే పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. రామగుండం రైల్వే స్టేషన్‌తోపాటు రైళ్లలో పోలీసుల ఆకస్మిక సోదాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తోందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఆదివారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీఐలు కొదురుపాక రాజేంద్రప్రసాద్, లింగమయ్య, ఎస్సై క్రాంతికుమార్ తదితరులు ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్‌తో గోరఖ్‌పూర్ రైలులో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ప్రధానంగా నేపాల్ రాష్ట్రానికి సమీపంలో ఉన్న లక్నో, గోరఖ్‌పూర్ రైళ్లలో ఎక్కువగా నేపాల్ రాష్ట్రానికి చెందిన వారు కూడా ప్రయాణిస్తుండడంతో.. వారి కదలికలు, లగేజీపై ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బంగ్లాదేశ్ రాష్ట్రానికి చెందిన వేలాది మంది రోహింగ్యాలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నట్లు సమాచారమందడంతో వారిపై కూడా నిఘా పెట్టినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఇప్పటికే తమ కాలనీల్లో అద్దెకు దిగే ఇళ్లలో అనుమానితులను గుర్తిస్తే స్థానిక పోలీసులకు సమాచారమందించాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదేమైనా ఓవైపు చోరీ నిందితులు, మరోవైపు దేశ ద్రోహులను పట్టుకునేందుకు రైళ్లలో నిఘా వ్యవస్థను పెంచినట్లు స్పష్టమవుతోంది.


