● గాడిదల గండి వద్ద యువకుడి మృతదేహం లభ్యం ● కుటుంబ సభ్యులతో కలిసి దళిత సంఘాల ఆందోళన
యైటింక్లయిన్‌కాలనీ/మంథని: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ(29) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఏప్రిల్ 29న కనిపించకుండా పోయిన వంశీ మృతదేహం కుళ్లిన స్థితిలో ఆదివారం మంథని మండలం గాడిదల గండి వద్ద పొదల్లో లభ్యమైంది. వంశీ కనిపించడం లేదని ఈనెల 1న గోదావరిఖని టూటౌన్ పోలీసులకు మృతుడి తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. దళిత సంఘాలు గాడిదల గండి వద్ద మంథని ప్రధాన రోడ్డుపై కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించి ఆందోళనకు దిగారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి విరమింపజేశారు. ఏసీపీ మాట్లాడుతూ.. వంశీ చిన్ననాటి స్నేహితురాలు అలేఖ్యతోపాటు నవీన్, భాస్కర్‌కు ఎక్కువగా కాల్ చేశాడని తెలిపారు. అలేఖ్యకు వంశీతో ఉన్న గొడవల కారణంగా హైదరాబాద్‌కు పిలిపించి శంషాబాద్‌లో భాస్కర్ అనే వ్యక్తి గదిలో హత్య చేసినట్లు తెలిపారు. శవాన్ని చాపలో చుట్టి గాడిదల గండి వద్ద పడేసినట్లు పేర్కొన్నారు. విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.


