రోడ్డు ప్రమాదంలో యువకుల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుల దుర్మరణం

May 11 2026 8:50 AM | Updated on May 11 2026 8:50 AM

వేములవాడఅర్బన్‌: రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఆరెపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన వంశీ(19), కేసీఆర్‌నగర్‌కు చెందిన నవీన్‌ కరీంనగర్‌ నుంచి కారులో వస్తున్నారు. వేములవాడ మండలం ఆరెపల్లి శివారులో లారీని ఢీకొట్టడంతో డ్రైవింగ్‌ సీట్‌లో ఉన్న వంశీ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ నవీన్‌ను వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ తెలిపారు.

ధర్మపురిలో..

ధర్మపురి: ధర్మపురిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్సై మహేశ్‌ కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన తోగిటి వాసు(32) ద్విచక్రవాహనంపై జగిత్యాల వెళ్లి తిరిగి వస్తున్నాడు. పట్టణ శివారులో ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొనడంతో వాసుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ పబ్బతి జగదీష్‌గా గుర్తించారు. వాసు ధర్మపురిలో ఓ జువెల్లరీ దుకాణంలో కూలీగా పని చేస్తున్నాడు. తండ్రి గతంలోనే మృతిచెందాడు. తల్లి వరలక్ష్మిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. కొడుకు మృతి వార్త తెలియగా తల్లి గుండెలవిసేలా రోదించింది. వాసు చిన్నాన్న వెంకటేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

శతాధిక వృద్ధురాలు మృతి

కథలాపూర్‌(వేములవాడ): సిరికొండ గ్రామానికి చెందిన చిలుక రాజుబాయి(105) అనే శతాధిక వృద్ధురాలు అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి ఒక కుమార్తె, కుమారుడు ఉండగా.. 60 మంది వరకు మనుమలు, మనుమరాళ్లున్నట్లు బంధువులు పేర్కొన్నారు. రాజుబాయి వందేళ్ల వయస్సులోనూ తన పని తాను చేసుకునేదని, మనుమలు, మనుమరాళ్లకు పురాతన కథలు చెప్తూ ఆనందంగా గడిపేదన్నారు. ఐదు రోజుల క్రితం అనారోగ్యానికి గురి కాగా.. ఆదివారం మృతిచెందిందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement