కాసుపత్రులు..! | - | Sakshi
Sakshi News home page

కాసుపత్రులు..!

May 11 2026 8:50 AM | Updated on May 11 2026 8:50 AM

● కమీషన్ల వేటలో ప్రైవేటు ఆస్పత్రులు ● అవసరం లేకుండానే ఖరీదైన వైద్య పరీక్షలు ● బాధితులు వస్తే చాలు.. రోగమేదైనా.. అందిన కాడికి దండుకోవడమే పని ● నియంత్రణలేని ఆస్పత్రుల ఫీజులు● కొంతమంది వైద్యుల్లో లోపిస్తున్న నైతిక ప్రాక్టీస్‌ ● పట్టించుకోని వైద్యారోగ్యశాఖ అధికారులు

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన శ్రీధర్‌ తల నొప్పితో బాధపడుతూ స్పెషా లిటీ వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ వైద్యుడిని సంప్రదించాడు. రోగి వైద్యుడి వద్దకు వెళ్లకముందే అక్కడ పనిచేసే ఉద్యోగులు ఎమ్మారై స్కాన్‌, రక్తపరీక్షలు చేయించుకు రావాలని కాగితంపై రాసిచ్చారు. ఈ పరీక్షలకు రూ.15 వేలు చెల్లించాలని చెప్పడంతో శ్రీధర్‌ తల గిర్రున తిరిగింది.

కరీంనగర్‌లోని కట్టరాంపూర్‌కు చెందిన రాజయ్య జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. సుమారు 15 రకాల వైద్య పరీక్షలు రాసి వారం రోజులకు రూ.లక్ష బిల్లు వేయటంతో ఖంగుతిన్నాడు. అంత కట్టలే ను అంటే అంత స్థోమత లేనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రికే వెళ్లొచ్చు కదా అని సూచనలివ్వడంతో అవాక్కయ్యాడు.

నగరానికి చెందిన సమత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పేరున్న ఓ గైనకాలజిస్టును సంప్రదించింది. పరీక్షించిన సదరు డాక్టర్‌ కొన్ని పరీక్షలు చేయించుకురమ్మని చీటీరాసి పంపించింది. డాక్టర్‌ చెప్పిన స్కానింగ్‌ సెంటర్‌కు కాకుండా సమతకు తెలిసిన వారి వద్దకు వెళ్లింది. రిపోర్టు డాక్టర్‌కు చూపించగా అవి సరిగా లేవని, తాను చెప్పిన సెంటర్‌కే వెళ్లాలని మరోసారి పంపించింది.

అల్లోపతిక్‌ ప్రైవేటు మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ (రిజిస్ట్రేషన్‌, రెగ్యులేషన్‌) యాక్ట్‌–2002 ప్రకారం వైద్యులు ఏ రోగానికి ఎంత మేరకు ఫీజులు తీసుకుంటున్నారో నోటీస్‌ బోర్డులో తెలియజేయాల్సి ఉంది. చాలా ఆస్పత్రుల్లో అలాంటి బోర్డులు కనిపించడం లేదు. కొంత మంది వైద్యులు నోటీస్‌ బోర్డుల్లో ఫీజులు వివరాలు పెట్టినా, అదనంగా వసూలు చేస్తున్నారు. కలెక్టర్‌ దృష్టి సారించి అల్లోపతిక్‌ చట్టం అమలు జరిగేలా, వైద్యుల అనైతిక ప్రాక్టీస్‌కు చెక్‌పెట్టి రోగులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

జిల్లా వివరాలు

ప్రైవేటు ఆస్పత్రులు 286

ప్రైవేటు క్లినిక్‌లు 222

రోగనిర్ధారణ కేంద్రాలు 58

కరీంనగర్‌: కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కమీషన్ల దందా నడుస్తోంది. ప్రాణాల కన్నా కమీ షన్లే లక్ష్యంగా ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు రోగుల రక్తం తాగుతున్నాయి. సాధారణ జ్వరంతో వెళ్లినా అవసరం లేని వైద్య పరీక్షలు చేయించి రూ.వేలల్లో గుంజుతున్నారు. ఆస్పత్రి నిర్వాహకులు, ల్యాబ్‌, స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకుల మధ్య ఉన్న ఒప్పందంతో అవసరం లేకపోయినా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి పీడిస్తున్నారని పలువురు సీనియర్‌ వైద్యులే వాపోతున్నారు. కొంత మంది రోగి ముఖం చూడకుండానే వైద్య పరీక్షలు రాస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో అసిస్టెంట్లే జూ నియర్‌ డాక్టర్‌ పేరిట అవసరం లేకున్నా వివిధ రకాల టెస్టులు రాసి పేదలను దోచుకుంటున్నారు.

ఎమ్మారై, సిటీస్కాన్‌లో సగానికి పైగా వైద్యులకే

ఆస్పత్రుల నిర్వాహకులు తాము రాసిచ్చిన ల్యాబ్‌, డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కే వెళ్లాలని ఒత్తిడి చేస్తుండగా.. ఎమ్మారై, సిటీస్కాన్‌ లాంటి వైద్య పరీక్షలకు డయాగ్నోస్టిక్‌ సెంటర్లు రోగుల వద్ద నుంచి వసూలు చేసే ఫీజులో సగానికి పైగా వైద్యులకే అందజేస్తున్నామని స్కాన్‌ సెంటర్ల నిర్వాహకులే చెబుతున్నారు. సిటీస్కాన్‌కు రూ.3 వేలు నుంచి రూ.6 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. ఎమ్మారైకి రూ.5 వేల నుంచి రూ.12 వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఇతర ల్యాబ్‌, డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో పరీక్షలు చేయించుకుని రిపోర్టులు తీసుకెళ్తే సరిగా లేవని తిప్పి పంపడం సర్వసాధారణమైంది.

స్కానింగ్‌ ఫీజు ఆస్పత్రిలోనే వసూలు

స్కానింగ్‌ సెంటర్‌లో చెల్లించాల్సిన డబ్బులు కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులే వసూలు చేస్తున్నారు. కమీ షన్‌ తీసుకుని మిగతావి అప్పగిస్తున్నారు. ఇలా చే యడం వల్ల తాము సూచించిన స్కానింగ్‌ సెంటర్‌ కు పేషెంట్‌ ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. ఇక ల్యాబ్‌ల్లో చేసే వివిధ రకాల రక్త పరీక్షలకు వసూలు చేసే ఫీజులో 40 నుంచి 60శాతం వరకు వైద్యులకు ముట్టచెబుతున్నారు. సాయంత్రానికి కమీషన్‌ పంపించకుంటే మరునాడు తమ స్కానింగ్‌ సెంటర్‌ లేదా ల్యాబ్‌కు రోగులను పంపటం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. కమీషన్ల దందా బహిరంగమే అయినా యంత్రాంగం నియంత్రణ కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కలెక్టర్‌ దృష్టి సారించాలి

Advertisement
 
Advertisement
Advertisement