సర్కారుకు ఆదాయం.. సామాన్యులపై భారం | - | Sakshi
Sakshi News home page

సర్కారుకు ఆదాయం.. సామాన్యులపై భారం

May 11 2026 8:44 AM | Updated on May 11 2026 8:44 AM

భూముల మార్కెట్‌ విలువ భారీగా పెంపు జూన్‌ 1 నుంచే కొత్త ధరలు అమలు? ఉమ్మడి కరీంనగర్‌లో 50 నుంచి 100శాతం పెరిగే అవకాశం 13 లోపు ప్రభుత్వానికి నివేదిక

కరీంనగర్‌క్రైం: భూముల మార్కెట్‌ విలువను పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పట్టణ, నగర ప్రాంతాల్లో కమర్షియల్‌ ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్ల మార్కెట్‌ విలువను 50శాతం నుంచి 100 శాతం వరకు పెంచే దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ, మున్సిపల్‌శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై ఈనెల 8న చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ లాండ్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ) అధికారులు వీసీలో సమీక్షించారు. ఈ నెల 13లోపు నివేదిక పంపాలని ఆదేశించారు. జిల్లాల నుంచి నివేదిక రాగానే జూన్‌ 1వ తేదీ నుంచే కొత్త మార్కెట్‌ ధరలు అమల్లోకి వచ్చే అవకాశముంది.

ఎక్కడ ఎంత వరకు?

ప్రస్తుత మార్కెట్‌ విలువ, వాస్తవ మార్కెట్‌ ధరలకు చాలా వ్యత్యాసముందని ప్రభుత్వం భావిస్తోంది. కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పట్టణ విస్తరణ, కొత్త లేఅవుట్లు, కమర్షియల్‌ నిర్మాణాలు, రహదారి అభివృద్ధితో భూముల అసలు ధరలు భారీగా పెరిగాయి. దీంతో కొత్త విలువలు నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కరీంనగర్‌ పరిసర ప్రాంతాలు, విలీన గ్రామాల్లో ధరల విలువలు పెంచుతున్నట్లు తెలిసింది. రేకుర్తి, పద్మనగర్‌, చింతకుంట, అలుగునూర్‌, హౌసింగ్‌బోర్డు, బొమ్మకల్‌, నగునూరుతో తదితర ప్రాంతాల్లో భారీగా పెంపు ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.

రిజిస్ట్రేషన్లపై ప్రభావం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. నెలకు రూ.20 కోట్ల వరకు ఆదా యముంటుంది. మార్కెట్‌ ధర పెరిగితే రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంప్‌డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ పెరగనున్నాయి. ప్రస్తుతం రూ.10 లక్షల మార్కెట్‌ విలువ ఉన్న స్థలం కొత్త ధర ప్రకారం రూ.18లక్షల నుంచి రూ.20 లక్షలకు చేరితే, రిజిస్ట్రేషన్‌ ఖర్చు రెట్టింపవుతుంది. తద్వారా రిజిస్ట్రేషన్‌శాఖకు అదనపు ఆదాయం చేకూరుతుంది. కాగా.. మధ్యతరగతి, చిన్న స్థలాలు కొనుగోలు చేసేవారు పెరుగుతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆదాయ వృద్ధే లక్ష్యమా?

భూముల మార్కెట్‌ విలువల పెంపు వెనుక ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ఉద్దేశమే ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రిజిస్ట్రేషన్‌శాఖ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం గత కొంతకాలంగా కీలక వనరుగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో భూముల అసలు ధరలు ఎక్కువగా, ప్రభుత్వ విలువ తక్కువగా ఉండటంతో భారీగా ఆదాయం కోల్పోతున్నామన్న అభిప్రాయమున్నట్లు సమాచారం. అందుకే ప్రస్తుత మార్కెట్‌ ధరకు దగ్గరగా ప్రభుత్వ విలువలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

వ్యవసాయ భూములపైనా ప్రభావం

వ్యవసాయ భూముల విషయంలో కొన్ని ప్రాంతాల్లో ధరల పెంపు ఉండే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి. హైవేలకు సమీ పంలో ఉన్న భూములు, త్వరలో మున్సిపల్‌ పరిధి లోకి వచ్చే గ్రామాలు, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ప్రభా విత ప్రాంతాల్లో గణనీయమైన పెంపు ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం అధికారులు ప్రాథమిక అంచనాలు, మార్కెట్‌ సర్వే, రిజిస్ట్రేషన్‌ డేటా ఆధారంగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుండగా, పెంపు శాతం, అమలు తేదీపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement