నేటి నుంచే జనగణన తొలి దశ జూన్ 10వరకు హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మొత్తం కాగిత రహిత గణనే స్వీయగణన చేయనివారు.. ఆందోళన చెందొద్దు సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్ 1855
33అంశాలతో వివరాలు సేకరణ
కరీంనగర్ అర్బన్: జనగణన– 2027 ప్రక్రియ తొలి దశ నేటి నుంచే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్యుమరేటర్లకు శిక్షణనివ్వగా, యాప్ వివరాలు అప్‌లోడ్ చేశారు. ముందుగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. పోర్టల్ ద్వారా ప్రజల తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి గృహాన్ని జియోట్యాగ్ చేసి వివరాలు నమోదు చేసుకోగా, హెచ్‌తో ప్రారంభమయ్యే 11అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీని భద్రపరిచారు. ఎన్యుమరేటర్లే ఇంటికి వచ్చి వివరాలను నమోదు చేసుకోనుండగా , ఐడీ నంబర్ ఇస్తే సరిపోతుంది. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల ద్వారా కుటుంబ వివరాలను ధ్రువీకరిస్తారు. జనగణన ప్రక్రియ కాగిత రహితమే కా గా.. సాంకేతికతతో డిజిటల్ గణన చేయనున్నారు.
జూన్ 10వరకు హౌస్ లిస్టింగ్
హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్‌ఎల్‌వో)లో భాగంగా బ్లాకులవారీగా ఇళ్లకు నంబర్లు కేటాయించనున్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి 9నుంచి 25వరకు వ్యక్తిగత వివరాల సేకరణ ఉండనుంది. స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాలు, జిల్లాల వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలోనే జనగణనలో పాల్గొనవచ్చని అధికారులు వివరించారు. జిల్లాస్థాయిలో ముఖ్య గణాంక అధికారిగా జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ నోడల్ అధికారిగా వ్యవహరించనుండగా మండలస్థాయిలో చార్జ్ ఆఫీసర్లుగా తహసీల్దార్లు, అర్బన్‌లో మున్సిపల్ కమిషనర్లు వ్యవహరిస్తారు. జిల్లాలోని 16 మండలాలు, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి మున్సిపాలిటీలు కలుపుకొని 1,227 హౌస్ లిస్టింగ్ బ్లాక్లుగా విభజించగా 1,234 మంది ఎన్యుమరేటర్లు, 215 మంది సూపర్‌వైజర్లను నియమించారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో 666 బ్లాకులుగా విభజించగా 733 మంది ఎన్యుమరేటర్లు, 122 మంది సూపర్‌వైజర్లు విధులు నిర్వహించనున్నారు. ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్, ఒక్కో ఎన్యుమరేటర్ సుమారు 200 ఇళ్ల వివరాలు సేకరిస్తారు.
2011 లెక్కల ప్రకారం
జిల్లా జనాభా 10,05,711
నివాసాలు 2,58,485
కుటుంబాలు 2,90,657
కుటుంబ యజమాని పేరు, కుటుంబంలోని ఒకరి మొబైల్ నంబరు ఎంటర్ చేయాలి. ఆ నంబర్‌తో ఒక కుటుంబం వివరాల నమోదుకు మాత్రమే అవకాశముంటుంది. మొబైల్ నంబరుతో పాటు ఈ మెయిల్‌కు ఐడీ నంబరు వస్తుంది. పిన్‌కోడ్, గ్రామం/నగరం, ప్రాంతం, స్థానిక ల్యాండ్ మార్క్, భవనం నంబరు, నివాసయోగ్య స్థితి, వసతులు, మతం, షెడ్యూల్ కులాలు, తాగునీటి వసతి, గృహ వినియోగం, ఇంధనం తదితర వివరాలను చెప్పాల్సి ఉంటుంది.


